ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రాధాన్యత మరింత బలపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం, సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. విభిన్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఏకాభిప్రాయ సాధనకు భారత్ ఒక వేదికగా ఎదిగిందన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉపముఖ్యమంత్రి కే. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏకపక్ష యుద్ధాల్ని ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్ చేయడం చారిత్రాత్మకమని తెలిపారు.