వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి అన్నారు. గురువారం వీరనారి చాకలి(చిట్యాల) ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని న్యూ శాయంపేట జంక్షన్ లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఛైర్ పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, అధికారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
భావితరాలకు పోరాట స్ఫూర్తి వీరనారి చాకలి ఐలమ్మ
మహిళా సాధికారత, సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం కృషి: కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి.
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని న్యూ శాయంపేట జంక్షన్ లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, అధికారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు.
ఈ సందర్భంగా కుడా ఛైర్ పర్సన్ సుధారాణి మాట్లాడుతూ
చాకలి ఐలమ్మ కేవలం ఒక వర్గం కోసం పోరాడిన మహిళ కాదని, రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరవనితగా చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. చాకలి ఐలమ్మ పోరాటం మహిళా సాధికారతకు, ఆత్మగౌరవానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత, సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు.
పోరాటయోధుల త్యాగాలు, పోరాటాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని, ఆమె స్ఫూర్తిని నేటి తరానికి అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు ఎన్. రవి, వై వి గణేష్, ఎల్ కిషోర్ కుమార్, వరంగల్ ఆర్డీవో సుమ, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పుష్పలత, లక్ష్మణ్, మత్స్య శాఖ అధికారి శ్రీపతి, డాక్టర్ మధుచందర్, మాజీ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, మాజీ కార్పొరేటర్ చీకటి ఆనంద్, మున్సిపల్, కుడా, ఇతర శాఖల అధికారులతో పాటు ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.