Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

పరీక్షలు రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.

పరీక్షలు రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి
Share Short Clip Download PDF

ప్రతి సెషన్ పరీక్షకు అరగంట ముందు గేట్ల మూసివేత

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ నెల 13వ తేదీన ( ఆదివారం)నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామ్- 2, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ -2 పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాలలో అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్ డి ఎ, ఎన్ఏ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో పరీక్షలు జరిగే హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ప్రభుత్వ పింగిళి డిగ్రీ, పీజీ కళాశాలలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను గురించి సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ

పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో వైద్య సదుపాయం ఉండేలా చూసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు.
పరీక్ష నిర్వహణలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పరీక్షా గదుల నిర్వహణ, తాగునీటి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్డీఏ, నావల్ అకాడమీ పరీక్ష ఈనెల 13న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, అదేవిధంగా వడ్డేపల్లి లోని పింగిళి ప్రభుత్వ బాలికల డిగ్రీ, పీజీ కళాశాలలో సిడిఎస్ పరీక్ష ఉదయం 9 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుండి 2:30 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్షలను అధికారులు సమన్వయంతో ప్రశాంతంగా, సజావుగా సాగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో పరీక్షలు ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర పరిశీలకులు ఉమేష్ మీనా, రాష్ట్ర పరిశీలకులు సురేష్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికారులతో మాట్లాడారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో గౌరీ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, మై భారత్ కోఆర్డినేటర్ భూక్య సంజీవ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి, పింగిళి కళాశాల నుండి డాక్టర్ సుహాసిని, పోలీస్ శాఖ నుండి ఎస్సై ప్రసాద్, విద్యుత్ శాఖ ఏఈ అలేఖ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.