హైదరాబాద్ (రైట్స్ మీడియా): కేంద్ర మాజీ మంత్రి, బహుజన నాయకుడు దివంగత గడ్డం వెంకట్ స్వామి (కాకా) జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు వివేక్ వెంకట్ స్వామి, మహమ్మద్ అజారుద్దీన్‌లతో పాటు పలువురు ముఖ్య నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకట్ స్వామి జయంతి: విగ్రహానికి పూలమాలలేసి మంత్రుల నివాళులు
⏩పేదలు, అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నిరుపమాన నేత వెంకట్ స్వామి: మంత్రి పొన్నం ప్రభాకర్
⏩కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకట్ స్వామి (కాకా) జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్ ,ఇతర ముఖ్య నేతలు
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
కోట్లాది మంది జన్మించినా, సమాజంపై చెరగని ముద్ర వేసే మహనీయులు కొందరే ఉంటారని, అలాంటి గొప్ప నాయకుల్లో కాకా వెంకట్ స్వామి ఒకరని కొనియాడారు. నీతి నిజాయితీలకు కట్టుబడి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు అమోఘమని పేర్కొన్నారు. కాకా వెంకట్ స్వామి గారితో కలిసి రాజకీయంగా ప్రయాణించే అవకాశం రావడం తన అదృష్టమని, విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే ఆయన తనకెంతో ప్రోత్సాహాన్ని, మార్గదర్శకత్వాన్ని ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడం, పేదలకు అండగా నిలవడం ఆయన నుంచే నేర్చుకున్నానని తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా కాకా అందించిన సూచనలు, ఆమోదయోగ్యమైన వ్యూహాలు తెలంగాణ ఏర్పాటులో ఎంతో కీలక పాత్ర పోషించాయని వివరించారు. నేడు కాకా వెంకట్ స్వామి ఆశయాలకు అనుగుణంగా ఆయన కుటుంబ సభ్యులు ప్రజాసేవలో కొనసాగడం అభినందనీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని మంత్రి పొన్నం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు మరియు కాకా అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.