11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలోని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ 50 పడకల ఆసుపత్రిలో బుధవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆయుష్ శాఖ డైరెక్టర్ ఐషా మసరత్ ఖానం, ఐఏఎస్, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై ధన్వంతరి భగవాన్‌కు పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలనతో శిబిరాన్ని ప్రారంభించారు
ఆయుర్వేదం కేవలం వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానం, సమతుల్య ఆహారం, దినచర్య, ప్రకృతి ఆధారిత వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు అందుబాటులో ఉన్న ఆయుష్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం వివిధ వైద్య విభాగాలను పరిశీలించి ప్రజలకు అందుతున్న ఆయుష్ వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆయుష్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. 289 మందికి వైద్య సేవలు మెగా వైద్య శిబిరానికి మొత్తం 289 మంది హాజరై వైద్య సేవలు పొందారు. మధుమేహం, రక్తపోటు, అధిక బరువు, కీళ్ల సమస్యలు, చర్మ వ్యాధులు, జ్వరం, దగ్గు, జలుబు, అస్తమా, స్త్రీ సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి వైద్య సలహాలతో పాటు ఆయుష్ చికిత్సా విధానాలపై సూచనలు అందించారు. ఆరోగ్యకరమైన జీవన విధానం, సమతుల్య ఆహారం, యోగా, దైనందిన జీవితంలో ఆయుర్వేద సూత్రాల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు.