Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
క్రైమ్ న్యూస్

భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హోటల్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం కలకలం

భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హోటల్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం కలకలం
Share Short Clip Download PDF

నిజామాబాద్ (రైట్స్ మీడియా): నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ హోటల్ వ్యాపారి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. భీమ్‌గల్ పట్టణానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి స్థానికంగా టిఫిన్/హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇటీవల రాత్రి వేళల్లో నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా హోటల్ తెరిచి ఉంచారనే కారణంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో, సోమవారం భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుధాకర్, ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌‌ను ఒంటిపై పోసుకుని నిప్పుంటించుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే ఎస్సై అంబులెన్స్‌లో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. తమ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, బాధితుడు ఏ కారణంతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడనే దానిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. పోలీసుల కేసు నమోదు వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడా లేదా దీని వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

⏩రైట్స్ మీడియా గమనిక:

ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి లేదా నిరాశకు గురైనప్పుడు సహాయం కోసం అధికారిక హెల్ప్‌లైన్ నంబర్లను (104 లేదా 1800-599-0019) సంప్రదించండి.

Source / reference: Senior Journalist Nakka Rakesh, Nizamabad.