Thursday, 05 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

వరద ముంపునకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి

⏩57వ డివిజన్‌లో రూ.2.52 కోట్లతో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన..

వరద ముంపునకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి
Share Short Clip Download PDF

⏩అంబేద్కర్‌ జంక్షన్ నుంచి వడ్డేపల్లి చర్చి వరకు రూ.18 కోట్లతో రోడ్డు విస్తరణ..

⏩ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి సాధ్యం: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ(రైట్స్ మీడియా): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 57వ డివిజన్‌లోని సమ్మయ్యనగర్, గోకుల్‌నగర్ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. డివిజన్‌లో సుమారు రూ.2.52 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

అభివృద్ధి పనులను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా గోకుల్‌నగర్, సమ్మయ్యనగర్‌తో పాటు పరిసర కాలనీల్లో వర్షాకాలంలో ఏర్పడుతున్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

రెండు వైపుల నుంచి వచ్చే వరద నీటితో ముంపు

అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వర్షపు నీరు, సుబేదారి పోలీస్ స్టేషన్ వైపు నుంచి వచ్చే నీరు గోకుల్‌నగర్ చౌరస్తా వద్ద కలిసిపోవడంతో ప్రతి వర్షాకాలంలో గోకుల్‌నగర్‌తో పాటు పరిసర కాలనీలు నీట మునిగే పరిస్థితి ఏర్పడుతోందని ఎమ్మెల్యే వివరించారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులను చేపడుతున్నట్లు తెలిపారు.

ఎన్నో సంవత్సరాలుగా వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇకపై అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం నుంచి వడ్డేపల్లి చర్చి వరకు రోడ్డు విస్తరణ కోసం సుమారు రూ.18 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, రెండు రోజుల్లో టెండర్ ఓపెన్ చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

రోడ్డు విస్తరణతో పాటు గోకుల్‌నగర్ చౌరస్తా,వడ్డేపల్లి చౌరస్తాలను సుందరీకరించి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు విస్తరణ పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో పెరుగుతున్న జనాభా, వాహనాల రాకపోకలకు అనుగుణంగా మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనుల విషయంలో దుకాణదారులు, ఇళ్ల యజమానులు ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనుల సమయంలో కొంతమేర ఇబ్బందులు, నష్టం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను అందించేందుకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ముందుకు వెళ్తామని చెప్పారు. అభివృద్ధి పనులను అడ్డుకునే విధంగా వ్యవహరించడం వల్ల చివరికి నష్టపోయేది ప్రజలేనని, అందువల్ల చిన్నచిన్న వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి సమష్టి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

డ్రైనేజీ పనులకు సంబంధించి కొందరు వ్యక్తిగత సమస్యలను ముందుకు తీసుకువచ్చి అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటికి పరిష్కారం చూపేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే ప్రజలందరికీ ఉపయోగపడే అభివృద్ధి పనులను అడ్డుకునే విధంగా వ్యవహరించవద్దని కోరారు.

ఎన్నో ఏళ్లుగా గోకుల్‌నగర్, సమ్మయ్యనగర్, పరిసర కాలనీల ప్రజలు వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే అవకాశం వచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులకు సహకరించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.

రోడ్లు, డ్రైనేజీ, రోడ్డు విస్తరణ, చౌరస్తాల సుందరీకరణ పనులను సమన్వయంతో పూర్తి చేసి 57వ డివిజన్‌ను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు వరద ముంపు సమస్య నుంచి శాశ్వత ఉపశమనం లభించడంతో పాటు మెరుగైన రహదారి, డ్రైనేజీ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వారివెంట డివిజన్ ఇంచార్జ్ ఇ.వి శ్రీనివాస్ రావు,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్,డివిజన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి ఆయా కాలనీల ప్రజలు, అధికారులు ఉన్నారు.