Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన విభాగాల పనితీరుపై అదనపు డీసీపీ సమీక్ష సమావేశం

• మహిళల రక్షణ , భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి: అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్

మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన విభాగాల పనితీరుపై అదనపు డీసీపీ సమీక్ష సమావేశం
Share Short Clip Download PDF

• మహిళల రక్షణ , భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి: అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్

నిజామాబాద్ (రైట్స్ మీడియా): నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, మహిళల భద్రత , రక్షణ , సంక్షేమానికి సంబంధించిన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో షీ టీమ్స్, భరోసా సెంటర్ , యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, గృహ హింస నిరోధక విభాగం, మిస్సింగ్ ఉమెన్, మహిళా సహాయ విభాగాలు, ఉమెన్ హెల్ప్ డెస్క్ తదితర విభాగాల పనితీరును సమీక్షించారు.

ఆయా విభాగాల ద్వారా మహిళలు, బాలికలకు అందిస్తున్న సేవలు, అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకుంటున్న చర్యలు, పరిష్కారం కాని కేసుల పురోగతి తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధికారులు సత్వరమే స్పందించాలని, బాధితులకు భరోసా కల్పిస్తూ వారికి న్యాయం జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళలపై వేధింపులు , గృహ హింస , మానవ అక్రమ రవాణా వంటి నేరాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని , బాధితుల ఫిర్యాదులను సున్నితంగా స్వీకరించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన విభాగాల పనితీరుపై అదనపు డీసీపీ సమీక్ష సమావేశం

షీ టీమ్స్ ద్వారా మహిళలు , బాలికలకు భద్రతపై అవగాహన కల్పిస్తూ , వేధింపులకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు అవసరమైన సహాయం, కౌన్సెలింగ్, సంబంధిత శాఖల సమన్వయంతో తగిన సేవలు అందించాలని సూచించారు. మహిళా పోలీస్ స్టేషన్లు, ఉమెన్ హెల్ప్ డెస్క్‌లకు వచ్చే ఫిర్యాదులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళలు, బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అన్ని సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో సి.సి.ఆర్.బి ఏసిపి గురు నాయుడు, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ప్రసాద్ , సి.సి.ఎస్ సి.ఐ సురేష్, షీ టీం మహిళా ఎస్సై స్రవంతి మరియు సంబంధిత విభాగల అధికారులు పాల్గొన్నారు.

Source / reference: Senior Journalist Nakka Rakesh, Erstwhile Nizamabad.