Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

మాదిగ సామాజిక వర్గానికి చెందిన అధ్యాపకులపై కక్షపూరిత చర్యలు ఆమోదయోగ్యం కాదు: కేయూ విద్యార్థి నాయకులు

⏩ప్రొఫెసర్ ఇస్తారి, ఆన్‌లైన్ పత్రికపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్.. యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు వినతిపత్రం అందజేత.

మాదిగ సామాజిక వర్గానికి చెందిన అధ్యాపకులపై కక్షపూరిత చర్యలు ఆమోదయోగ్యం కాదు: కేయూ విద్యార్థి నాయకులు
Share Short Clip Download PDF

కాకతీయ యూనివర్సిటీలో విధులు నిర్వర్తిస్తున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ ఎల్.పి. రాజ్‌కుమార్, కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ మంథని శంకర్ లపై ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేయూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఓ ఆన్‌లైన్ పత్రికతో పాటు, దానికి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ మంగళవారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లకు వారు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మాదిగ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ..

యూనివర్సిటీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రొఫెసర్ ఇస్తారి, ఆన్‌లైన్ పత్రికను అడ్డుపెట్టుకుని తోటి అధ్యాపకులపై కక్ష సాధింపులకు పాల్పడటం యూనివర్సిటీ ప్రతిష్టను అభాసుపాలు చేయడమేనని విమర్శించారు. ప్రొఫెసర్ రాజ్‌కుమార్, డాక్టర్ శంకర్‌ల వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు రిజిస్ట్రార్ నియమించిన కమిటీలో సభ్యుడిగా ఉన్న ప్రొఫెసర్ ఇస్తారి.. గోప్యంగా ఉంచాల్సిన కమిటీ విషయాలను పత్రికకు చేరవేస్తున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించారు.

గతంలో ఓ పరిశోధక విద్యార్థిని వేధించిన ఆరోపణల నేపథ్యంలో ప్రొఫెసర్ ఇస్తారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా, ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చిన విషయం యూనివర్సిటీ అధికారులకు తెలుసని విద్యార్థులు గుర్తుచేశారు. అటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తిని, మాదిగ సామాజిక వర్గ అధ్యాపకులపై వేసిన విచారణ కమిటీలో సభ్యుడిగా నియమించడం ఎంతవరకు సమంజసమో పాలకవర్గం పునరాలోచించుకోవాలని వారు కోరారు.

తమ వర్గ అధ్యాపకులపై కల్పిత వార్తలు రాస్తున్న సదరు ఆన్‌లైన్ పత్రికపైనా, అందుకు సహకరిస్తున్న ప్రొఫెసర్‌ పైనా తక్షణమే అట్రాసిటీ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మంద భాస్కర్ మాదిగ, మంద నరేష్, బోట్ల మనోహర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

📄 కేయూ వీసీ, రిజిస్ట్రార్లకు విద్యార్థి నాయకులు అందజేసిన వినతిపత్రం. (ఆధారం)