Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

పన్ను వసూళ్లలో వేగం పెంచండి: బల్దియా కమిషనర్ వెంకన్న

బల్దియా ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం రెవెన్యూ అధికారులతో రెవెన్యూ సంబంధిత అంశాల పురోగతిపై జరిగిన సమావేశంలో సమగ్రంగా సమీక్షించిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న.

పన్ను వసూళ్లలో వేగం పెంచండి: బల్దియా కమిషనర్ వెంకన్న
Share Short Clip Download PDF

▪️టాప్ డిఫాల్టర్ల పై ప్రత్యేక దృష్టి సారించి వసూళ్లు చేపట్టాలి..... ▪️పన్ను బకాయిల వసూళ్లకు కఠిన చర్యలు తీసుకోండి....

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్లకు నిర్దేశించిన లక్ష్యాల సాధనలో మరింత వేగం పెంచాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు.

శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ట్యాక్సేషన్, రెవెన్యూ అధికారులతో ఆయన సర్కిల్‌ల వారీగా పన్నుల వసూళ్ల పురోగతిని సమీక్షించారు. ఆస్తి పన్నుల వసూళ్లు, కొత్త నిర్మాణాల గుర్తింపు, ప్రభుత్వ భవనాల రీ-అసెస్‌మెంట్, కమర్షియల్‌, నాన్‌ కమర్షియల్‌ భవనాల పన్నుల విధింపు, ఆన్‌ కలెక్టబుల్‌ డిమాండ్లు, డబుల్‌ అసెస్‌మెంట్లు, వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ (VLT), ప్రాపర్టీ రివిజన్‌ తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

పన్నుల వసూళ్ల లక్ష్యాలను సర్కిల్‌, వార్డు స్థాయిలో విభజించి, రోజువారీ పురోగతిని తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. కొత్త అసెస్‌మెంట్లు, పెండింగ్‌ బకాయిలు, వీఎల్‌టీ, డబుల్‌ అసెస్‌మెంట్లు, కమర్షియల్‌ భవనాల గుర్తింపు తదితర అంశాలపై రెవెన్యూ సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పన్నుల అసెస్‌మెంట్‌, వసూళ్ల ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని తెలిపారు. అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం డిస్మాంటిల్‌ చేసిన భవనాలకు సంబంధించిన పాత హౌస్‌ నంబర్లను గుర్తించి, పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. ఈ వివరాలను ఉప కమిషనర్లు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, తుది నివేదికను సమర్పించాలని సూచించారు.

పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు ఉన్న డిఫాల్టర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్‌ ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల వసూళ్లకు ఆర్‌ఆర్‌ చట్టం ప్రకారం చర్యలు చేపట్టేందుకు వివరాలను సమర్పించాలని తెలిపారు. నగర పరిధిలోని ప్రతి ప్లాట్‌ను గుర్తించి నిబంధనల ప్రకారం వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ (VLT) వసూలు చేయాలని కమిషనర్‌ స్పష్టం చేశారు. పన్నుల వసూళ్లలో వెనుకబడిన సర్కిళ్లు, వార్డులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, అవసరమైన చోట్ల ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయిలో పర్యటించి బకాయిలను సేకరించాలని సూచించారు.

నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని కమిషనర్‌ హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్య సాధన దిశగా సిబ్బందిని సమన్వయం చేయాలని ఆదేశించారు. పన్ను వసూళ్ల లో వృద్ధిని పెంచడానికి త్వరలోనే వార్డు ఆఫీసర్ లు బిల్ కలెక్టర్ లు,రెవిన్యూ అధికారులతో సమన్వయం సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఆస్తి పన్ను తో సమాంతరం గా నీటి పన్ను బకాయి లపై దృష్టి సారించాలని ఈ సందర్భం గా కమిషనర్ అన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్‌ జోనా, డిప్యూటీ కమిషనర్లు బిర్రు శ్రీనివాస్‌, ప్రసన్నరాణి, ట్యాక్సేషన్‌ అధికారి రామకృష్ణ, ఐటీ మేనేజర్‌ రమేష్‌, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.