యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడుతూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గూడూరు మండల కేంద్రంలో మన ఊరు - మన బాధ్యత ‘2K రన్ – ఫర్ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక పాఠశాలలు, కళాశాలలకు చెందిన 1,000 మందికి పైగా విద్యార్థులు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ జెండా ఊపి 2K రన్‌ను ప్రారంభించారు.
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: జిల్లా ఎస్పీ డా. శబరీష్
గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో ఘనంగా 2K రన్. జండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్,
ఈ సందర్భంగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ..
విద్యార్థి దశ ఎంతో విలువైనదని, యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ తమ జీవిత లక్ష్యాలను సాధించేందుకు కష్టపడాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే జీవితాంతం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందని ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా గంజాయి టెస్టింగ్ కిట్ పనితీరును విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాల వినియోగంపై అనుమానం ఉన్న సందర్భాల్లో పరీక్షల ద్వారా గుర్తించే విధానం గురించి అవగాహన కల్పించారు. యువత ఇటువంటి పరిస్థితులకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. డ్రగ్స్‌ను విక్రయించడం, సరఫరా చేయడం, రవాణా చేయడం లేదా వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే NDPS చట్టం ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
మైనర్లకు సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా తదితర పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణదారులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కిరాణా, పాన్ షాపుల వద్ద మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదనే హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు, యువత పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం కోసం యాంటీ-డ్రగ్ హెల్ప్‌లైన్ నంబర్ 87126 56999కు సంప్రదించాలని కోరారు.
కార్యక్రమం ముగింపులో ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువతతో కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.