Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మహిళలు భాగస్వాములు కావాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మహిళలు భాగస్వాములు కావాలి
Share Short Clip Download PDF

డ్రగ్స్‌, మద్యం వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండేలా అవగాహన కల్పించి, డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనిజిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, సీపీ శ్వేత, పిలుపునిచ్చారు.
శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సమాజ భద్రత కోసం డ్రగ్స్ నిర్మూలననే లక్ష్యంగా చేపట్టిన సంఘమిత్ర అవగాహన కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, డీసీపీ దార కవిత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంద సుజాత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...

ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలు, టౌన్ లెవల్ ఫెడరేషన్ల సభ్యులు రహిత సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. మహిళా సంఘాలు, టౌన్ లెవల్ ఫెడరేషన్లకు జిల్లాలో ఎంతో బలమైన నెట్‌వర్క్‌ ఉందని తెలిపారు. ఒక చిన్న సందేశాన్ని మహిళా సంఘాల ద్వారా పంపితే అది వేలాది మంది మహిళలకు, తద్వారా లక్షలాది కుటుంబాలకు చేరే అవకాశం ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో మహిళా సభ్యులు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ దాదాపు లక్ష మంది వరకు మహిళలు వివిధ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. యువతలో మార్పులను తల్లులే ముందుగా గుర్తించాలని, యువత డ్రగ్స్‌ లేదా మద్యం వ్యసనాలకు లోనవుతున్నప్పుడు వారి ప్రవర్తనలో అనేక మార్పులు కనిపిస్తాయని చెప్పారు. గతంలో అందరితో కలిసి మెలిసి ఉండే యువకులు లేదా యువతులు అకస్మాత్తుగా ఒంటరిగా ఉండటం, ఎక్కువగా మాట్లాడటం లేదా తమకు సంబంధించిన విషయాలను కుటుంబ సభ్యులతో చెప్పకపోవడం వంటి ప్రవర్తనా మార్పులను తల్లులు, కుటుంబ సభ్యులు ముందుగానే గుర్తించాలని సూచించారు. పిల్లలు డబ్బులు అడిగినప్పుడు దేనికి ఖర్చు చేస్తారు అనే విషయాలను తెలుసుకోవాలని సూచించారు. మహిళల సహకారం లేకుండా డ్రగ్స్‌ నిర్మూలన సాధ్యం కాదని పేర్కొన్నారు. డ్రగ్స్‌ వ్యతిరేక కార్యక్రమాలను కేవలం పోలీసు, ప్రభుత్వ యంత్రాంగంతోనే నిర్వహించడం సాధ్యం కాదని, మహిళా సంఘాలు, కుటుంబాలు, సమాజం సహకారం ఎంతో అవసరమన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో డీ-అడిక్షన్‌ కేంద్రం సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, వ్యసన బాధితులకు వైద్య చికిత్సతోపాటు కౌన్సెలింగ్‌ సహాయం అందుతుందని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ..

మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ మహిళలు, యువత కుటుంబాలకు అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణా గురించిన సమాచారం తెలిసినప్పుడు పోలీసులకు బాధ్యతగా తెలియజేయాలన్నారు. అభివృద్ధి లో మహిళల చైతన్యం ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. అన్నీ శాఖల అధికారులు సహకరిస్తేనే రాబోయే రోజుల్లో మాదక ద్రవ్యాల వాడకాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు.

ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత మాట్లాడుతూ

డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టి యువతను మత్తు పదార్థాల బారి నుంచి కాపాడటంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. మహిళల చైతన్యంతోనే డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సామాజిక సమస్యల పరిష్కారంలో క్రియాశీలక భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కుటుంబ వ్యవస్థలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళలు కుటుంబానికి మార్గదర్శకులుగా, పిల్లలకు ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు. ప్రస్తుతం డ్రగ్స్‌ వినియోగం సమాజంలో, ముఖ్యంగా యువతలో ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని డీసీపీ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు సంబంధించిన అనేక కేసులను పోలీసులు నమోదు చేస్తూ, అక్రమ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ, కేవలం కేసులు నమోదు చేయడం, పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మాత్రమే సమస్యను పూర్తిగా పరిష్కరించలేమన్నారు.
మహిళలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు డ్రగ్స్‌ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. తమ కుటుంబాల్లోని పిల్లలు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించాలని సూచించారు.
డ్రగ్స్‌ వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితిపై, సామాజిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు, మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మహిళలు ముందుకు వచ్చి సామాజిక బాధ్యతగా డ్రగ్స్‌ వ్యతిరేక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా రాబోయే తరాలను రక్షించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్డీఏ మేన శ్రీను, మెప్మా పీడీ రాజేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మహిళలు భాగస్వాములు కావాలి