పల్నాడు (రైట్స్ మీడియా): పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఉన్న కూరగాయల మార్కెట్‌ వద్ద ఓ మహిళపై యువకుడు కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది.

వేల్పూరు గ్రామానికి చెందిన తమ్మిశెట్టి సుజాత (35) పిడుగురాళ్ల పట్టణ శివారు ఆదర్శకాలనీలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆటో కోసం వేచి ఉన్న సమయంలో నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో సుజాత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.

దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన దేవళ్ల పార్వతమ్మపై కూడా నిందితుడు కత్తితో దాడి చేయడంతో ఆమెకు గాయాలైనట్లు తెలిసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని ఎస్‌ఐ మోహన్ పట్టుకున్నట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, నిందితుడి వివరాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున, పోలీస్‌స్టేషన్‌ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.