మండల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరములో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 18 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో వెంకటరమణ తెలిపారు. అందులో రెవిన్యూ పరిధిలో తొమ్మిది, హౌసింగ్ పరిధిలో నాలుగు, వి బి జి రామ్ జి పరిధిలో ఒకటి, ఎలక్ట్రిసిటీ పరిధిలో ఒకటి, ఆర్టీసీ పరిధిలో ఒక్కటి, ఎంపీ ఓ, ఏపీవో పరిధిలో ఒకటి, మున్సిపాలిటీ పరిధిలో ఒక్కటి దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వెంకటరమణ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి, పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఎంపిడిఓ అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట తహసిల్దార్ విజయసాగర్, మండల వ్యవసాయ అధికారి విజయకుమార్ , ఎస్సై సాయిబాబు, ఏపీవో సహా మండల స్థాయి అధికారులు అందరూ హాజరైనట్లు తెలిపారు.