హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ముత్తారం చౌరస్తా నుంచి గట్ల నర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామానికి చేరుకున్న మంత్రి ముందుగా రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
అనంతరం గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.