ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమక్షంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువత తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.