USA(రైట్స్ మీడియా): పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి పేరును ఆయన 'ట్రంప్ స్ట్రెయిట్'గా మారుస్తూ తన అధికారిక 'ట్రూత్ సోషల్' మీడియా వేదికగా మ్యాప్ ను పోస్ట్ చేశారు.
హార్ముజ్ జలసంధి మ్యాప్ ను 'ట్రంప్ స్ట్రెయిట్’గా మార్చిన ట్రంప్
ఇరాన్ ప్రతిపాదన తిరస్కరణ...
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం కోసం ఇరాన్ ఒక ఏడు రోజుల ఫ్రేమ్వర్క్ ప్రతిపాదనను ట్రంప్ ముందుంచింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకారంగా.. అమెరికా తన నావల్ బ్లాకేడ్ ఎత్తివేయాలని, ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు తొలగించాలని, లెబనాన్తో సహా కాల్పుల విరమణను పాటిస్తే ఏడు రోజుల్లో సాధారణ సముద్ర రవాణాను పునరుద్ధరిస్తామని షరతు పెట్టారు. అయితే, ఈ ప్రతిపాదనను ట్రంప్ తీవ్రంగా తిరస్కరించారు.
దూకుడు వ్యూహం , హెచ్చరికలు...
ఇరాన్ ప్రతిపాదనలను తిరస్కరించడమే కాకుండా, చమురు రవాణా మార్గంపై అమెరికా పూర్తి నియంత్రణలో ఉందనే సంకేతాన్నిస్తూ హర్మూజ్ జలసంధి ప్రాంతాన్ని 'ట్రంప్ స్ట్రెయిట్'గా మారుస్తూ సదరు మ్యాప్ను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. గతంలోనూ ఈ జలసంధిని అమెరికా ఆధీనంలో ఉన్న ప్రాంతంగా అభివర్ణించిన ఆయన, ఇప్పుడు ఈ పేరు మార్పు ద్వారా తన దూకుడు వ్యూహాన్ని మరోసారి ప్రదర్శించారు. మరోవైపు ఇరాన్ ఎప్పటికీ అణుబాంబును సంపాదించకుండా అడ్డుకుంటామని, అవసరమైతే అమెరికా సైనిక దాడులు కొనసాగుతాయని ట్రంప్ హెచ్చరించడం గమనార్హం. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో, అమెరికా అధికారులు మధ్యవర్తులతో కలిసి సానుకూల , నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది.
అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావం....
ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురు మరియు గ్యాస్లో దాదాపు ఐదవ వంతు ఈ హర్మూజ్ జలసంధి గుండానే వెళుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల ఈ మార్గంలో రవాణా నిలిచిపోవడం లేదా మందగించడం అనేది అంతర్జాతీయంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ఇంధన ధరల పెరుగుదల ట్రంప్ యంత్రాంగానికి రాజకీయంగా కూడా పెను సవాలుగా మారుతోంది.