బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో రౌడీషీటర్ మహమ్మద్ నయీం హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి సహా ముగ్గురిని నాగోల్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఖమ్మంకు చెందిన కె.ఉమామహేష్ అలియాస్ జేకే మహేష్ (34), సాయినగర్‌కు చెందిన మహమ్మద్ మున్నా అలియాస్ బోలె (47), ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దుగ్గిరాల కార్తీక్ (29)లను ఎల్.బి.నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 14న బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో నయీమ్‌పై నిందితులు వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 16న ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి ఉమామహేష్ మాత్రం అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
తాజాగా అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నయీం, ఉమామహేష్ బాల్య స్నేహితులు. చిన్నతనం నుంచే నేరాలకు పాల్పడటంతో ఇల్లందు పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరిపై రౌడీషీట్లు ఉన్నాయి. కొంతకాలంగా ఇల్లందు, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు చేస్తూ ఉండేవారు. ఓ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో విభేదాలు రావడంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, ఉమా మహేష్ ఖమ్మంలో సోలార్ ప్యానల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాగా ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు ఒకరిపై ఒకరు కక్ష పెంచుకునేలా దారితీసింది.
నయీంను హత్య చేసేందుకు ఈ నెల 13న ఖమ్మంలోని ఓ హోటల్‌లో ఉమా మహేష్ తన అనుచరులతో కలిసి పథకం రచించి మరుసటి రోజు ఖమ్మం నుంచి నిందితులు కారులో హైదరాబాద్‌కు చేరుకున్నారు. మున్నా ద్వారా నయీంకు ఫోన్ చేసి అతడి ఆచూకీ తెలుసుకున్నారు. బండ్లగూడ సుప్రీం వైన్స్‌లో నయీం ఉన్నట్లు నిర్ధారించుకుని అక్కడికి వెళ్లి అతడి కళ్లలో కారం చల్లి వెంబడించిన నిందితులు.. హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది అరెస్టు కాగా.. తాజాగా మరో ముగ్గురి అరెస్టుతో మొత్తం అరెస్టుల సంఖ్య 11కు చేరింది. కాగా ఈ కేసులో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్, ఐపీఎస్ బి.సుమతి ఆదేశాలతో ఎల్.బి.నగర్ డీసీపీ బి.అనురాధ, ఎస్ఓటి ఏసీపీ రవీందర్‌రెడ్డి పర్యవేక్షణలో నాగోల్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పరారీలో ఉన్న నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టి ప్రధాన సూత్రధారి ఉమామహేష్‌తో పాటు మరో పదిమంది నిందితులను అరెస్టు చేసినట్లు నాగోల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు.