దక్షిణ తెలంగాణలోని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కృష్ణా నది నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డిల బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యింది. ప్రస్తుతం జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు కీలక దశలో ఉన్నందున, వాటిని కాపాడేందుకు కర్ణాటక నుంచి కృష్ణా జలాలను విడుదల చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి తెలంగాణ ప్రతినిధి బృందం తీసుకెళ్లింది.

ఈ నాలుగు సాగునీటి పథకాల కింద దాదాపు 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, ఈ ప్రాంతాల్లో వేలాది రైతు కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయని వివరించారు. ప్రస్తుత దశలో నీటి కొరత ఏర్పడితే పంట దిగుబడులతో పాటు రైతుల ఆదాయం, జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఒక నెల పాటు ప్రస్తుత పంటలను కాపాడేందుకు కృష్ణా నది నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని నిరంతరాయంగా ఒక నెల రోజుల పాటు విడుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మంత్రులు, ఎమ్మెల్యేల బృందం కోరింది. ఈ నీటితో కీలక దశలో ఉన్న పంటలకు సకాలంలో సాగునీరు అందించి రైతులను ఆదుకోవచ్చని వివరించింది.

మిగిలిన రుతుపవన కాలంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రస్తుతం నియంత్రిత పద్ధతిలో నీటిని విడుదల చేస్తే అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని ప్రతినిధి బృందం వివరించింది. రైతుల పంటలు, వారి జీవనోపాధిని కాపాడటమే ప్రధాన లక్ష్యంగా కర్ణాటక ముఖ్యమంత్రితో ఈ భేటీ జరిగింది. పొరుగు రాష్ట్రాల మధ్య సహకార స్ఫూర్తితో కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కోరారు. మంత్రులు చేసిన విజ్ఞప్తికి కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రైతులకు లాభం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.