హనుమకొండ (రైట్స్ మీడియా): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన గడిచిన 33 నెలల్లో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
శనివారం 31వ డివిజన్ పరిధిలోని అవంతి స్కూల్ కాలనీ, హంటర్ రోడ్ విశాల్ మార్ట్ ఆవరణ, సూర్యోదయ కాలనీ, శ్రీరామ్ హిల్స్, హంటర్ హిల్స్ రోడ్ నంబర్ 3 ప్రాంతాల్లో సుమారు రూ.2.60 కోట్లతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కాలనీ ప్రజలు, సంబంధిత అధికారులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.