న్యూఢిల్లీ(రైట్స్ మీడియా): ప్రజాస్వామ్యానికి ప్రాణం ఓటు.. ఆ ఓటు హక్కునే బలహీనపరిచే ప్రయత్నాలు జరిగితే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఓటు ప్రతి పౌరుడి గొంతుక అని, ఆ గొంతును ఎవరూ నొక్కేయలేరని స్పష్టం చేశారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో సాగుతున్న పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్యమమని పేర్కొన్నారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి పార్టీలు, యువత, పౌర సమాజ ప్రతినిధులు చేపట్టిన సుప్రీంకోర్టు మార్చ్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్,వాకిటి శ్రీహరి, టిపీసీసీ మహేష్ గౌడ్,సీనియర్ నేత వి.హెచ్,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,మధుయాష్కీ గౌడ్,తదితరులతో కలిసి పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ.. కాంగ్రెస్ జెండా పట్టుకొని ర్యాలీలో నిరసన వ్యక్తం చేసిన మంత్రి.. ఓటర్ల హక్కులను కాపాడాలని, SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, శాంతియుతంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న వారి గొంతును అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.