Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

జాతీయ సేవ పథకాల ద్వారా విశ్వవిద్యాలయ ప్రతిష్టను మరింత పెంచాలి: వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి

జాతీయ సేవ పథకాల ద్వారా విశ్వవిద్యాలయ ప్రతిష్టను మరింత పెంచాలి: వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి
Share Short Clip Download PDF

కాకతీయ విశ్వవిద్యాలయ సెనెట్‌ హాల్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ ఆచార్య ఈసం నారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశానికి వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జాతీయ విద్యా విధానం–2020 అకడమిక్‌ అంశాలతో పాటు విలువలు, నైపుణ్యాలు, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ‘వికసిత్‌ భారత్‌–2047’, ‘రైజింగ్‌ తెలంగాణ’ లక్ష్యాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలను రూపొందించి, యువత సామాజిక అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించేలా ప్రోత్సహించాలని సూచించారు. సాంకేతికత, కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయుల పాత్ర తరగతి గదికే పరిమితం కాకూడదన్నారు. బోధనతో పాటు అడాప్టబిలిటీ, ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వంటి నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని, ఈ దిశగా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తో హైదరాబాద్ లోక్‌భవన్‌లో జరిగిన సమావేశం సూచనల మేరకు విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ‘నషా ముక్త్‌ భారత్‌’, రెడ్‌క్రాస్‌ సభ్యత్వం, ‘మై భారత్‌’ పోర్టల్‌ నమోదు కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసి సమాజానికి మెరుగైన సేవలు అందించాలని, విశ్వవిద్యాలయ నిధులతో ఎంపానెల్డ్‌ సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

గౌరవ అతిథిగా పాల్గొన్న స్టూడెంట్‌ అఫైర్స్‌ డీన్‌ ఆచార్య మామిడాల ఇస్తారి మాట్లాడుతూ..

రెడ్‌క్రాస్‌ సభ్యత్వం, ‘మై భారత్‌’ పోర్టల్‌లో నమోదు ప్రాధాన్యతను వివరించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో కాకతీయ విశ్వవిద్యాలయం ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.

సభాధ్యక్షులు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ ఆచార్య ఈసం నారాయణ మాట్లాడుతూ ..

విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్‌ శ్రీజా జాతీయ స్థాయి యువ పార్లమెంట్‌లో ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. గత ఏడాది పరిధిలో ప్రతిష్టాత్మక మేడారం జాతర లో వాలంటీర్ లు పాల్గొన్నారు, అదే విధంగా 170 ప్రత్యేక ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. పరిధిలోని జిల్లాల్లో యువ పార్లమెంట్‌ కార్యక్రమాలతో పాటు విశ్వవిద్యాలయ స్థాయి యువ పార్లమెంట్‌ను నిర్వహించి, విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయికి ప్రోత్సహించినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ జిల్లా ఎన్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ డా. ఎం. రాంబాబు, జనగామ జిల్లా కన్వీనర్‌ డా. వి. శ్రీనివాస్‌, మహబూబాబాద్‌ జిల్లా కన్వీనర్‌ ఎం. అనిల్‌కుమార్‌, ములుగు జిల్లా కన్వీనర్‌ సీహెచ్‌. ప్రసన్నకుమార్‌, భూపాలపల్లి జిల్లా కన్వీనర్‌ ఎం. యుగేందర్‌, క్యాంపస్‌ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. టి. రాధిక, న్యాయ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. వై. ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.