రాయపర్తి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అనుమానిత వ్యక్తుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ సూచించారు. గ్యాస్ ఈ-కేవైసీ, కొత్త గ్యాస్ కనెక్షన్లు, ఆధార్ ఈ-కేవైసీ, రేషన్ కార్డు ఈ-కేవైసీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఇంటి రుణాలు, పంట రుణాలు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు కొత్త వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు. గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామని, ఫోన్ అప్‌డేట్ చేయాలని చెప్పి మహిళలను నమ్మించి మెడలోని బంగారు ఆభరణాలను పక్కన పెట్టాలని సూచిస్తూ వాటిని అపహరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఎస్సై పేర్కొన్నారు.
అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో కనిపిస్తే వారి వివరాలను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు తమ విలువైన వస్తువులు, నగదు, వ్యక్తిగత వివరాలు, ఆధార్ తదితర పత్రాలను అపరిచితులకు ఇవ్వవద్దని ఎస్సై ముత్యం రాజేందర్ కోరారు.