Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

వెనుకబడిన రంగాలకు రుణాల మంజూరులో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

వెనుకబడిన రంగాలకు రుణాల మంజూరులో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
Share Short Clip Download PDF

శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో 2026–27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి జిల్లాలో బ్యాంకింగ్ రంగం పనితీరు, ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..

ప్రాధాన్యతా రంగాల వార్షిక రుణ లక్ష్యం రూ.2,599.49 కోట్లు కాగా, జూన్ త్రైమాసికం నాటికి రూ.451.73 కోట్లు, అంటే 17.38 శాతం సాధించారని స్పష్టంచేశారు. ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.611.03 కోట్ల లక్ష్యానికి గాను రూ.261.51 కోట్లు, 42.80 శాతం రుణాలు అందించారని వివరించారు. వ్యవసాయ, మౌలిక సదుపాయాల కల్పన, విద్యా గృహ రుణాల వంటి రంగాల్లో రుణాల మంజూరు పురోగతి ఆశించిన స్థాయిలో లేదని, ఈ రంగాల్లో బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, ప్రతి నెలా పురోగతిని సమీక్షించుకోవాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందేలా బ్యాంకర్లు చొరవ చూపాలని తెలిపారు.
డిపాజిట్లు సేకరిస్తూ రుణాల మంజూరులో వెనుకబడిన బ్యాంకులు పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లలో రుణాల మంజూరు పురోగతి లేకపోవడంపై సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించి, తక్షణ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పలిమేల, మొగుళ్లపల్లి, ఘన్‌పూర్ మండలాల్లో 10 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిరుపయోగంగా ఉన్న ఖాతాలను త్వరితగతిన పునరుద్ధరించాలని ఆదేశించారు.

PM విశ్వకర్మ, PMEGP దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి

PM విశ్వకర్మ పథకంలో దరఖాస్తుల తిరస్కరణ రేటు 38.2 శాతంగా ఉండటంపై అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆరా తీశారు. దరఖాస్తుల తిరస్కరణకు గల కారణాలను క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించాలని, అర్హులైన లబ్ధిదారులకు రుణాలు త్వరితగతిన మంజూరు చేసి పంపిణీ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లా అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, వ్యవసాయం, స్వయం ఉపాధి, మహిళా సంఘాలు, సూక్ష్మ పరిశ్రమలు, బలహీన వర్గాలకు రుణ సదుపాయాలను మరింత పెంచాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నాగరాజు, బ్యాంకుల అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.