రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేరడానికి నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని అన్నారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు ఈ చారిత్రక సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. “అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం మా ప్రజా పాలనకు పునాదులు. సెప్టెంబర్ 17వ తేదీ మన బాధ్యతను కూడా గుర్తు చేసే రోజు. ఈ చారిత్రక నేపథ్యం, ఉద్యమాల ఫలాలు ప్రజల జీవితాల్లో కనిపించాలి. రైతుకు భరోసా ఉండాలి. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి. పేద బిడ్డకు మంచి చదువు, మంచి వైద్యం అందాలి. యువతకు ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు రావాలి. తరతరాల అణిచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ. నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ. అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ నేల ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యాన్ని రగిలించిందని అన్నారు.
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం అధికారికంగా భారతదేశంలో అంతర్భాగమైంది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భం. అందుకే సెప్టెంబర్ 17ను మనం “ప్రజా పాలన దినోత్సవం”గా జరుపుకుంటున్నాం. ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం… వారి సమస్యలకు పరిష్కారం చూపడం. వారి హక్కులను కాపాడడం. ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడడం. అదే స్ఫూర్తితో ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ప్రజా పాలన కొనసాగిస్తున్నాం. తెలంగాణ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతోంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931కు చేరింది. ఇది దేశ తలసరి ఆదాయం కన్నా దాదాపు 91 శాతం అధికం. అభివృద్ధి అంకెల్లో మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించాలన్నదే మా లక్ష్యం. ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి. ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశాం. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలను అప్పుల ఊబి నుంచి బయటపడేశాం. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశాం. సన్నాలకు క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించామని అన్నారు.
తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ సగర్వంగా జీవించాలి. ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఈ ప్రయాణాలతో మన ఆడబిడ్డలకు రూ.12,385 కోట్ల మేర ఖర్చు ఆదా అయింది. గృహజ్యోతి కింద 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 43 లక్షల కుటుంబాలకు రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1 లక్ష 68 వేల మంది ఆడబిడ్డలకు రూ. 4,709 కోట్ల సహాయం చేశాం. 4.54 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.60 వేల 487 కోట్ల బ్యాంకు లింకేజీ, రూ. 1,900 కోట్ల వడ్డీ రాయితీ కల్పించాం. మహిళా మార్ట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులతో మహిళల ఆదాయం పెంచుతున్నాం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 3.42 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. 15 లక్షలకు పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశాం. 43 లక్షలకు పైగా మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల కింద సుమారు రూ. 31 వేల కోట్లు అందించాం. తాజాగా మరో 2.25 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో నివసించాలనేది మా ప్రభుత్వ ఆశయం. ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు అందించాం. రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. హైదరాబాద్ నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించామని అన్నారు.
ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ఆఫ్షోర్ క్యాంపస్లను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. అమెరికాకు చెందిన నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీతో పాటు బ్రిటన్లోని 17 స్వతంత్ర విద్యా సంస్థల సమాఖ్య యూనివర్సిటీ ఆఫ్ లండన్ తమ ఆఫ్షోర్ క్యాంపస్ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఆరోగ్య రంగానికీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5 లక్షల 19 వేల మందికి రూ.2,526 కోట్ల సహాయం అందించాం. సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో గోషామహల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం మొదలైంది. సనత్నగర్లో మర్రి చెన్నారెడ్డి టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించుకున్నాం. అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. వరంగల్లో 2 వేల పడకలతో టిమ్స్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తాం. తెలంగాణ ఉద్యమంలో యువత ముందుండి పోరాడింది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం పోరాడింది. 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశాం. గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాం. ఏఐతో ఉద్యోగాల స్వరూపం మారుతోంది. కొత్త నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసుకున్నాంమని అన్నారు.
ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ డిమాండ్ కూడా పెరిగింది. తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తున్నాం. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజల నుంచి కూడా సహకారం ఆశిస్తున్నాం. వీబీ జీ రామ్ జీలో ఎక్కువ పని దినాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.