నరసరావుపేట(రైట్స్ మీడియా): ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ చదువులో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఓ మధ్యతరగతి ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన విద్యార్థి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుకు నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు (సుబ్బు) రూ.30,000 ఆర్థిక సహాయం అందించారు.

నరసరావుపేట పట్టణంలోని పాండురంగస్వామి గుడి బజారులో నివసిస్తున్న తోమండ్రు రామ బాలాజీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గతంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో ప్రస్తుతం ఓ మాల్‌లో గుమస్తాగా నెలకు రూ.15,000 జీతంతో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన చిన్న కుమారుడిని మున్సిపల్ బాయ్స్ హైస్కూల్‌లో చదివిస్తుండగా, పెద్ద కుమారుడైన తోమండ్రు మహేష్ లక్ష్మణ్‌ను స్థానిక శ్రీ భవిష్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిస్తున్నారు.

అయితే మహేష్ లక్ష్మణ్ చదువులో ఎంతో ప్రతిభ కనబరుస్తున్నాడు. పదో తరగతిలో 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించి 97 శాతం ఉత్తీర్ణత పొందాడు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు గాను 460 మార్కులు సాధించి 98 శాతం మార్కులతో తన ప్రతిభను చాటుకున్నాడు.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుకు మొత్తం రూ.55,000 అవసరం కాగా, తండ్రి రూ.25,000 అప్పు చేసి ఫీజు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన రూ.30,000 కోసం సహాయం కోరుతూ పరిచయస్తుల ద్వారా అత్తులూరి సుబ్బారావును సంప్రదించారు.

గతంలోనూ ఈ విద్యార్థి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫీజును దాతల సహకారంతో సమకూర్చిన నేపథ్యంలో, ఇంతటి ప్రతిభావంతుడైన విద్యార్థికి ఆర్థిక ఇబ్బందులు చదువుకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో అత్తులూరి సుబ్బారావు తన మిత్రులు, దాతల సహకారంతో రూ.30,000 సమకూర్చి, ఆ కుటుంబానికి అందజేశారు.

ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత. ఆర్థిక పరిస్థితులు కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఆశయంతో ఈ సహాయం అందించామని అత్తులూరి సుబ్బారావు తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థి ఉన్నత విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం లభించింది.