Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

విద్యార్థులు కష్టపడి చదివి, ఉన్నత లక్ష్యాలను సాధించాలి: జిల్లా కలెక్టర్

విద్యార్థులు కష్టపడి చదివి, ఉన్నత లక్ష్యాలను సాధించాలి: జిల్లా కలెక్టర్
Share Short Clip Download PDF

భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రీ-ప్రైమరీ పాఠశాలలను జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులను పరిశీలించారు.
వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాహనాలు ఏర్పాటు చేసుకుని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థుల ప్రవేశాలను దాదాపు 50 శాతం పెంచడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యం..

పాఠశాలలోని సైన్స్‌ ల్యాబ్‌ను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్‌ వసతులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడారు. వారి చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థులు ఐఏఎస్‌, ఐపీఎస్‌, వైద్యులు, ఇంజనీర్లు కావాలనే తమ ఆకాంక్షలను వెల్లడించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.

చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణంలో విద్య

ప్రీ-ప్రైమరీ పాఠశాలలో చిన్నారులకు అందిస్తున్న అభ్యాసన పద్ధతులు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులను కలెక్టర్ పరిశీలించారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన మోడల్‌ మరుగుదొడ్లను కూడా పరిశీలించారు.
పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్క నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పాఠశాలకు కిచెన్‌ షెడ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు రుచికరంగా, నాణ్యంగా భోజనం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ లలిత, సర్పంచ్ శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.