మినిస్టర్ క్వార్టర్స్లో తెలంగాణ కేకేసీ యూనియన్ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
మంత్రి మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి సంక్షేమం కోసం త్వరలోనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. ఆటో ఛార్జీల పెంపు కోసం ఆటో కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. 2012లో ఛార్జీలు పెరిగాయి. దాదాపు 14 సంవత్సరాలుగా ఛార్జీల పెంపు జరగలేదు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని వారి ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే ప్రయాణికులపై అదనపు భారం పడకుండా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసి నడుపుతుందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా ఆర్టీసీకి ఎలాంటి ఆలోచన లేదు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేయదు. లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడమే మా లక్ష్యం. ఆర్టీసీ, రైల్వే, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను సమన్వయం చేసి ప్రయాణికులకు ఇంటి నుంచి గమ్యస్థానం వరకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రోఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆటో కార్మికులకు మరింత మేలు చేసేలా త్వరలోనే శుభవార్త చెబుతాం. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఆటో కార్మికుల ఉపాధికి పూర్తి రక్షణగా మా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు.