Sunday, 20 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేయాలి: బల్దియా కమిషనర్ టీ. వెంకన్న

నిమజ్జన కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలన.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం.

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేయాలి: బల్దియా కమిషనర్ టీ. వెంకన్న
Share Short Clip Download PDF

వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆదివారం లోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ. వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం నగర పరిధిలోని మడికొండ చెరువు, బంధం చెరువు, సిద్ధేశ్వర గుండం, ఉర్సుగుట్ట చెరువు, బేస్తం చెరువు, అగర్తల చెరువు, కట్టమల్లన్న చెరువు, చిన్నవడ్డేపల్లి చెరువు, ముచ్చర్ల చెరువు, హసన్‌పర్తి, భీమారం చెరువు తదితర నిమజ్జన ప్రాంతాలను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతులు, పారిశుద్ధ్య చర్యలు, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,

ఐదవ రోజు నుంచే వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా ముందస్తు చర్యలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. చెరువుల్లో మిగిలి ఉన్న గుర్రపు డెక్కను తొలగించడంతో పాటు పూడికతీత పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన సిబ్బందిని ముందుగానే కేటాయించి, విధుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని పేర్కొన్నారు.

విగ్రహాల నిమజ్జనానికి వినియోగించే క్రేన్లకు అవసరమైన ఇంధనాన్ని ముందస్తుగా సమకూర్చుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణను నిరంతరం కొనసాగించాలని సూచించారు. ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌బీ, డీఆర్‌ఎఫ్, మైనింగ్, మత్స్య తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించాలని ఆదేశించారు.

చెరువుల వద్ద తెప్పలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించేలా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. నిమజ్జన కేంద్రాల్లో ప్రజల రద్దీ, వాహనాల రాకపోకలు, భద్రతా పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.

భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వెలుతురు తదితర సదుపాయాలను అందుబాటులో ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఆరోగ్యాధికారి డా. రాజేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికుమార్, సంజయ్‌కుమార్, మహేందర్, సంతోష్‌బాబు, మాధవీలత, డీఈ రాజ్‌కుమార్, శానిటరీ సూపర్‌వైజర్ గోల్కొండ శ్రీను, ఏఈ హరికుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు.