తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డుకు ఎంపికయ్యారు. కేరళకు చెందిన దిగ్గజ నేత, మాజీ మంత్రి దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ (AMF) ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి రేవంత్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గానూ ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ ఛైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు.
అవార్డు ఎంపికకు ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఎ.పి. అనిల్‌కుమార్, ప్రముఖ మేధావి కల్పేట్టా నారాయణన్ జ్యూరీగా వ్యవహరించారు. ప్రజాస్వామిక విలువలపై రేవంత్ రెడ్డి కి ఉన్న నిబద్ధతను ఈ సందర్భంగా జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది. ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేరళలోని నిలంబూర్‌లో 25వ తేదీ శుక్రవారం జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. వేడుకలో ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆర్యదాన్ ముహమ్మద్ స్మారక ఉపన్యాసం చేస్తారు.