వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 572 మందిని గుర్తించి , పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ డివిజన్ వ్యాప్తంగా 280 మంది,ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా 175 మంది, బోధన్ డివిజన్ వ్యాప్తంగా 117 మందిని బైండోవర్ చేశారు. అనంతరం సంబంధిత మండల రెవెన్యూ అధికారులు (తహసీల్దార్లు/MROలు) ఎదుట హాజరుపరిచి, చట్టపరమైన నిబంధనల ప్రకారం బైండోవర్ చేశారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి గొడవలు , ఘర్షణలు , అల్లర్లు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిమజ్జన మార్గాలు, ప్రధాన కూడళ్లు, సున్నితమైన ప్రాంతాలు మరియు రద్దీ ప్రదేశాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు.
అలాగే నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, క్రమశిక్షణతో, పరస్పర సహకారంతో వ్యవహరించాలని పోలీసులు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటుందని, వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు.