ప్రియమైన సోదర సోదరీమణులారా !
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన హనుమకొండ జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఉద్యమకారులకు, పాత్రికేయులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
సెప్టెంబర్ 17, 1948 నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాజరిక వ్యవస్దను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్ధానానికి నాందిపలికారు. ఈ శుభదినాన్ని విలీనం అని ఒకరు, విమోచనం అని ఒకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పల్చన చేసేలా ప్రవర్తించడం సరికాదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఎందరో త్యాగధనుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఈ విజయం సాధించుకున్నాం. ఆ త్యాగధనులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాం.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి భారత్-పాక్ విభజన జరిగిన తరువాత దేశంలో అప్పటి వరకు బ్రిటీష్ వారి సహకారంతో స్వతంత్రంగా వ్యవహరించిన చాలా సంస్థానాల్లో కొన్ని భారతదేశంలో, మరికొన్ని పాకిస్థాన్ లో విలీనం అయ్యాయి. దేనిలో విలీనం కాకుండా రజాకార్ల అండతో స్వతంత్రంగా ఉండాలనుకున్నది నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం. తెలుగు వారు ఎక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం కూడా ఈ రాజ్యంలో ప్రధాన భాగంగా ఉండేది.
రజాకార్లను నిషేధించాలని కోరుతూ అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సెప్టెంబరు 7న నిజాంకు అల్టిమేటం పంపారు. కానీ నిజాం దాన్ని ఖాతరు చేయలేదు. దీంతో సెప్టెంబరు 13, 1948న అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఆదేశాల మేరకు ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశించింది. దాని ధాటికి తట్టుకోలేక నిజాం లొంగిపోవడంతో సెప్టెంబరు 17, 1948న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది. ఈ పరిణామంతో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రాజాస్వామ్య పరిపాలన ప్రారంభమైంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆ పెద్ద మనిషి నయా నిజాం అయ్యాడు. ఫలితంగా పదేళ్లలో తెలంగాణ నియంతపాలనలో మగ్గిపోయింది. ప్రజాస్వామ్యం పీక పిసికేసారు. తన తెలంగాణ అంటూనే ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, ఉద్యమాలను నిషేధించారు. కాదన్నవాడిని కాలికిందేసి తొక్కేసారు.
గత పదేళ్ల పాలనలో తెలంగాణలో ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది. సామాన్యులు తమ సమస్యలను పాలకులకు చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ప్రజల కోసం నిర్మించిన సచివాలయం ప్రజలకు దూరమైంది. ప్రజలతో ఉండాల్సిన పాలకులు ఇనుప కంచెల మధ్య పరిపాలన సాగించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుకు ప్రతీకగా ఉన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ను కూడా తొలగించి ప్రజల గొంతును అణిచివేశారు.
ఈ పరిస్ధితుల్లో మీ అందరి ఆశీస్సులు, దీవెనలతో నయా నియంతను తరిమికొట్టి 33 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన మన ప్రజా ప్రభుత్వం ఏడు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం ప్రాధమిక ఎజెండాగా పనిచేస్తోంది.
మన ప్రజా ప్రభుత్వం సంక్షేమాన్ని ఆర్థిక కోణంలోనో, ఖర్చు పెట్టిన రూపాయలతోనో లెక్క కట్టడం లేదు. మా సంక్షేమ ఆలోచనలో మానవీయత ఉంది. పేదవాడి పట్ల బాధ్యత ఉంది. వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన ఉంది. వారికి ఆరోగ్యవంతమైన జీవితాలను అందించే ప్రయత్నం ఉంది. ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించే సంకల్పం ఉంది. ఓట్ల కోసమో, మొక్కుబడి హామీలుగానో మేం సంక్షేమాన్ని చూడటం లేదు. ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం ఉంది.
ఈ 33 నెలల కృషి ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తోంది. ఆర్.బీ.ఐ. తాజా గణాంకాల ప్రకారం 2025-26లో మన రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటిచెప్పే గొప్ప విజయం ఇది.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. ఆహార ధాన్యాల కొరత నుండి ఆహార సమృద్ధి సాధన వరకు ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి, రైతును రాజును చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. అదే వారసత్వంతో రుణమాఫీ నుండి రైతు భరోసా వరకు రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయిల వరకు 21వేల కోట్ల రూపాయిల పంట రుణాలను మాఫీచేసి 25.35 లక్షల మంది రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది మన ప్రభుత్వం. రైతు భరోసా కింద ఈ 33 నెలల్లో 36 వేల కోట్ల రూపాయిల పెట్టుబడి సాయం అందించింది మన ప్రభుత్వం. ఈ వానాకాలం సీజన్ లో 70 లక్షల 11వేల మంది రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయిలను వారి బ్యాంక్ ఖాతాలో జమచేసి రైతు సంక్షేమంపట్ల మా నిబద్దతను చాటుకున్నాం. 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి రైతులకు అండగా నిలబడ్డాం. గడిచిన 33 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఏకంగా 1.70 లక్షల కోట్ల రూపాయిలను ఖర్చు చేసి రైతు కుటుంబాలకు మన ప్రభుత్వం అండగా నిలిచింది.
వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో మన తెలంగాణ పంజాబ్ను దాటేసింది. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది 3కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి రికార్డు స్ధాయిలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. మద్దత ధర చెల్లింపులను 48 గంటల్లోనే రైతు ఖాతాలో జమచేసింది మన ప్రభుత్వం.
ఈ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల పొలాలకు నీరు అందించాల్సిన సమయంలో రీడిజైన్ల పేరుతో కాలయాపన చేసింది. ప్రజల సొమ్మును భారీగా ఖర్చు చేసినా, ఆ స్థాయిలో సాగునీటి ఫలాలు రైతులకు అందలేదు.
కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తోంది. ఈ వరంగల్ ప్రాంత రైతాంగానికి దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టును కూడా ఏడాదిలోగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని వేగంగా పనులు చేపట్టాం.
భూపోరాటాల చరిత్రనే తెలంగాణ చరిత్ర. గత ప్రభుత్వ నిర్వాకం, స్వార్ధపూరిత విధానాల వల్ల రెవెన్యూ వ్యవస్ధ మొత్తం అస్థవ్యస్తమైంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు రెవెన్యూ వ్యవస్ధను పునర్నిర్మిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రజలు కోరిన భూవివాదాలు లేని తెలంగాణ ఉండాలన్న సంకల్పంతో చారిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చాం. ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏప్రిల్ 14, 2025 నుంచి ఇప్పటి వరకు 5,68,858 పాస్ బుక్కులు, ఈ చట్టానికి ముందు 6,71,508 మొత్తం ఈ 33 నెలల్లో 12,40,366 పాస్ బుక్ లను నా రైతు సోదరులకు అందజేయడం జరిగింది.
రాష్ట్రంలో దశాబ్దాలుగా భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో 125 సంవత్సరాల తరువాత రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా రీసర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటికే మొదటి దశలో 2,240 గ్రామాల్లో రీసర్వే ప్రారంభించాం. రీసర్వే అనంతరం ప్రతి భూ కమతానికి ఖచ్చితమైన హద్దులను నిర్ణయించి మనిషికి ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్ కేటాయిస్తున్నాం.
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు భూభారతి రీ-సర్వే ద్వారా పరిష్కారం చూపుతున్నాం. భూమిని సాగు చేస్తున్నా రికార్డుల్లో హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇప్పుడు చట్టబద్ధమైన భూ హక్కులు కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఒకటి రెండు ఉదాహరణలను మీముందు ఉంచుతున్నాను.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం, నారాయణపురం రెవెన్యూ గ్రామంలో రీ-సర్వేతో 906 మంది రైతులకు 1,600 ఎకరాలకుపైగా హక్కులు కల్పించాం. అలాగే సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల మండలాలలో 15 గ్రామాలల్లో రీ-సర్వే ద్వారా 2,400 మంది రైతులకు 3,450ఎకరాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. దీంతో పట్టాదారు పాస్బుక్లతో రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం లభించిందని మీ అందరికి సంతోషంగా తెలియజేస్తున్నాను.
తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇప్పటికే 335 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. ప్రతిరోజూ 34 లక్షలకు పైగా మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించు కుంటున్నారు. రాష్ట్రంలోని మహిళలు రూ.12 వేల కోట్లు ఆదాచేసుకున్నారు. గృహ జ్యోతి ద్వారా 53.09 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 10.97 కోట్ల జీరో బిల్లులు జారీ చేశాం. 42.90 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.70 వేల కోట్ల రుణాలు అందించాం. వడ్డీలేని రుణాల కింద రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేశాం. స్వయం సహాయక మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు హైటెక్ సిటీలోని శిల్పారామంలో స్టాల్స్ ను కేటాయించాం. మన మహిళలు పాఠశాల యూనిఫాంలు కుడుతున్నారు. చీరలు తయారు చేస్తున్నారు. పెట్రోలు బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మారారు. తెలంగాణ మహిళలు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా వ్యాపారాల్లో విస్తరించాలనేది ప్రభుత్వం ఆకాంక్ష.
సన్నబియ్యం ఓ విప్లవాత్మక పథకం. మనిషిని మనిషిగా గుర్తించి, ఆరోగ్యానికి భరోసా ఇచ్చే పథకం. సన్నబియ్యంతో బువ్వ తినడం మా హక్కు అని నమ్మకం కలిగించిన పథకం. కోటీ ఆరు లక్షల కుటుంబాలు, దాదాపు 3.38 కోట్ల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చాం. ఎన్నో సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. 16 లక్షల 32వేల 810 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశాం. పది సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ రేషన్ కార్డుల్లో 19 లక్షల 44వేల కొత్త సభ్యుల పేర్లను చేర్చింది మన ప్రజాప్రభుత్వం.
ఇందిరమ్మ ఇండ్లు అంటే కేవలం అవి నాలుగు గోడలు, పైన శ్లాబు మాత్రమే కాదు. పేదల ఆత్మగౌరవ ఆనవాళ్లు. జీవితమంతా కష్టించినా సొంత ఇల్లు కట్టుకోలేమన్న నిస్సహాయత నుండి మాకూ సొంత ఇల్లు ఉంది అని గర్వంగా చెప్పుకునే భరోసా. అందుకే పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నాం. తొలి దశలో 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేశాం. ఇప్పటికే రెండు లక్షలకు పైగా నా పేదింటి ఆడబిడ్డలు గృహప్రవేశాలు చేసుకొని తమ సొంత ఇంటిలో అడుగుపెట్టారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాల సమయంలో పాల్గొంటున్నప్పుడు ఆ పేదల కళ్లల్లో చూసిన ఆనందం నాకు ఎనలేని తృప్తినిచ్చింది.
ఈ ఏడాది రెండో విడతలో 2.50 లక్షల ఇండ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఖరీదైన నివాస ప్రాంతాల్లో లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం. ఈ ఇందిరమ్మ టవర్స్ కు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తిచేసుకున్నాం. ఏడాదిలోగా ఈ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం. క్యూర్ పరిధిలో మాదిరిగానే అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కూడ ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తాం. ఈ హనుమకొండ, వరంగల్ అర్బన్ ప్రాంతాల్లోనూ త్వరలో ఇందిరమ్మ టవర్స్ ప్రక్రియను ప్రారంభిస్తామని సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.
రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు 43 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నాం. డిసెంబర్ 2023 నుంచి జూలై 2026 వరకు పింఛన్ల కోసం రూ.30,089 కోట్లు పంపిణీ చేశాం. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు కొత్త ఫించన్లు మంజూరు చేయబోతున్నామని మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాను.
విద్యారంగంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుంది.
ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నాం. కుల మత బేధాలు లేకుండా విద్యార్థులందరూ ఒకేచోట చదువుకునేందుకు వీలుగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో వీటిని నిర్మిస్తున్నాం. ఇప్పటి వరకు 105 స్కూళ్లను మంజూరు చేశాం. ఇప్పటికే 84 స్కూళ్లకు అనుమతులు మంజూరు చేశాం.
ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్యను అందించాలని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది. అందుకే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించాం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యకు కొత్త రూపం ఇస్తున్నాం.
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 212 శాతం పెంచాం. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 22 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషకాహారం అందిస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నాం. ఇవన్నీ తెలంగాణ విద్యారంగానికి కొత్త దశదిశను అందిస్తున్నాయి.
పేదరికం కారణంగా చదువు ఆగకుండా విద్యార్థుల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తున్నాం. 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయంబర్స్ మెంట్ ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నాం. యాజమాన్యాల ప్రమేయం లేకుండా ప్రతి విద్యా సంవత్సరం నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయంబర్స్ మెంట్ జమ చేసే విధానం అమల్లోకి తెచ్చాం.
తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని ప్రజా ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వశాఖల్లో 72 వేలకుపైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, మెగా డీఎస్సీ నియామకాలు విజయవంతంగా నిర్వహించాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు, ఫలితాలు, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాం. టీజీపీఎస్సి ద్వారా 456 వివిధ పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం.
యువతకు విద్యతోపాటు నైపుణ్యం... నైపుణ్యంతో పాటు ఉద్యోగం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఇందులో ఇప్పటి వరకు 1,190 మంది అధునాతన నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో 838 మంది పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసుకున్నాం.
57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దాం. అక్కడ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఇప్పుడు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. అదే విధంగా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నాం. గ్రామీణ క్రీడా ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే క్రీడా విధానం అమలు చేస్తున్నాం. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహించబోతున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నాను.