నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా వద్ద హరిబాబు హత్యకు గురైన సంఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం రాత్రి సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ హత్యకు దారితీసిన పరిస్థితులు, సంఘటన జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలు తదితర అంశాలపై పోలీస్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సంఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి , కేసు దర్యాప్తును నిష్పక్షపాతంగా మరియు వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే సంఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించడం , సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడం, ప్రత్యక్ష సాక్షులు మరియు సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరించడం వంటి దర్యాప్తు చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంఘటన స్థలంలో అవసరమైన పోలీస్ బందోబస్తు మరియు పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా టౌన్ సీఐ శ్రీనివాసరాజ్ , టౌన్ రెండవ టౌన్ ఎస్సై యాదగిరి తదితరులు పాల్గొన్నారు.