న్యూఢిల్లీ, అక్టోబర్ 7 (రైట్స్ మీడియా): వైద్య సదుపాయాలు లేని మారుమూల గ్రామాలు, గిరిజన గూడేలకు ప్రాథమిక ఆరోగ్య భద్రత కల్పించే దిశగా ఒక సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించాలని పలువురు నిపుణులు, వక్తలు డిమాండ్ చేశారు.

బుధవారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలు – ప్రత్యామ్నాయ వైద్య సేవలు అనే అంశంపై ప్రత్యేక సదస్సు మరియు విశ్లేషణా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో అనధికారిక వైద్య సేవల వల్ల ఎదురవుతున్న సవాళ్లు, వాటికి శాస్త్రీయ పరిష్కారాలు, ప్రభుత్వాల బాధ్యతలపై లోతుగా చర్చించారు.

దేశంలో 65 శాతానికి పైగా జనాభా పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ, నిపుణులైన వైద్యులు, అత్యాధునిక వసతులు కేవలం పట్టణాలకే పరిమితం కావడంపై ఈ సదస్సులో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్.ఎం.పి, పి.ఎం.పి లను పూర్తిగా నిషేధిస్తే పల్లెల్లో వైద్య సేవలు కుప్పకూలుతాయని, అలా అని యథేచ్ఛగా వదిలేస్తే అమాయకుల ప్రాణాలకే ప్రమాదమని వక్తలు స్పష్టం చేశారు. అందువల్ల ఈ సంక్షోభానికి గుడ్డిగా సమర్థించడం లేదా పూర్తిగా వ్యతిరేకించడం కాకుండా ఒక మధ్యేమార్గమైన పరిష్కారాన్ని వెతకాలని అభిప్రాయపడ్డారు.

గ్రామాల్లో సేవలు అందిస్తున్న వారికి ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్దిష్టమైన శిక్షణ, బ్రిడ్జ్ కోర్సులు అందించి, కేవలం ప్రాథమిక లేదా ప్రథమ చికిత్సకు మాత్రమే వారిని పరిమితం చేయాలని సదస్సులో సూచించారు. అంతర్జాతీయ దేశాల మాదిరిగా మన దేశంలోనూ ప్రత్యేకంగా 'గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య ప్రదాతల' కేడర్‌ను ఏర్పాటు చేసి, ఏయే మందులు రాయవచ్చు, ఏ హద్దులు దాటకూడదు అనే అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు మరియు లైసెన్సింగ్ విధానం తేవాలని కోరారు.

అర్ధరాత్రి వేళల్లో మారుమూల పల్లెల్లో తల్లులు, బిడ్డలు ఎదుర్కొంటున్న వైద్య అత్యవసర పరిస్థితులకు తక్షణ భరోసా కల్పించేలా ప్రభుత్వాలు బలమైన ఆరోగ్య విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. పల్లె ప్రజల ఆరోగ్యం నగర ప్రజల ఆరోగ్యానికి ఎంతో తక్కువ కాదని, చీకట్లు కమ్మిన గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను వెలుగులోకి తెచ్చి ప్రజల ప్రాణాలకు సురక్షితమైన వారధిగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తక్షణ కార్యాచరణ చేపట్టాలని ఈ వేదిక ద్వారా గట్టిగా తీర్మానించారు.

ఈ సమావేశంలో తెలుగు దేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా బేసిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు టీడీ జనార్ధన్, ఎం.పి లు బీద మస్తాన్ రావు, D ప్రసాద రావు, ఆల్ ఇండియా బేసిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ Dr.కే.జీ గోవిందరెడ్డి, లీగల్ అడ్వైసర్ Dr.N.L రావ్ నేషనల్ జాయింట్ యాక్షన్ కమిటీ కో చైర్మన్ శ్రీముకేష్ అగర్వాల్.రాజా, రాజస్థాన్ నుండి అనుష్ తివారీ, బీహార్ నుండి O.P మిశ్రా, ఉత్తరప్రదేశ్ నుండి సుభాష్ సైనీ, హర్యానా నుండి ధన్ముల్ గోయల్,
పంజాబ్ నుండి C.S.రావు గుజరాత్ నుండి ప్రదీప్ కశ్యప్, మధ్యప్రదేశ్ నుండి ప్.మోహన్, తెలంగాణ నుండి U.B T. రాజు, ఆంధ్రప్రదేశ్.. రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.