Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

కరీంనగర్ బస్ స్టేషన్‌లో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి

కరీంనగర్ బస్ స్టేషన్‌లో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి
Share Short Clip Download PDF

కరీంనగర్ (రైట్స్ మీడియా): కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో బాబా సాహెబ్ డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..

భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని కరీంనగర్ బస్ స్టేషన్‌లో ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 2013లో తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అంబేద్కర్ జయంతి రోజున కరీంనగర్ బస్ స్టేషన్‌కు 'అంబేద్కర్ బస్ స్టేషన్'గా పేరు పెట్టుకున్నామని, 13 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని తెలిపారు. ఈ విగ్రహావిష్కరణ ఏర్పాటుకు అరేపల్లి మోహన్, దొంత రాజయ్య ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..

నేడు సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని, భూమి కోసం, భుక్తి కోసం ఆనాడు ఆమె చేసిన తిరుగుబాటును, అందరినీ ఐక్యం చేసిన తీరును గుర్తుచేసుకున్నారు. భవిష్యత్‌లో రాజ్యాంగం సంక్షోభంలో ఉందంటూ రాహుల్ గాంధీ చెప్పినట్లుగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేల ఆశయాలను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రజా పాలన ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత అనే మూడు ప్రధాన అంశాలతో ముందుకు పోతున్నామని మంత్రి వివరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు మాత్రమే కాదని, సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, అణగారిన వర్గాలకు ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించిందని తెలిపారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాలు ముందుకు రావడానికి రాజ్యాంగం బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు.

ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే కరీంనగర్ బస్‌స్టేషన్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ప్రత్యేకమైన విషయమని, ప్రతిరోజూ వేలాది మంది ఈ విగ్రహాన్ని చూస్తూ ఆయన ఆశయాలను, రాజ్యాంగ విలువలను గుర్తు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అంబేద్కర్ చెప్పినట్లుగా విద్య, సంఘటితం కావడం, హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడటం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని, ముఖ్యంగా యువత అంబేద్కర్ జీవితాన్ని, ఆయన ఆలోచనలను అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగం మనకు హక్కులు మాత్రమే కాకుండా బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని, మనమందరం రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావంతో ముందుకు సాగాలని కోరారు. తెలంగాణ ప్రజాపాలనలో కూడా సామాజిక న్యాయానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ అవకాశాలు, గౌరవం, న్యాయం అందే సమాజ నిర్మాణం కోసం మనమంతా కలిసి పనిచేయాలని, ఈ మహనీయుడి విగ్రహాన్ని కరీంనగర్ బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మన జీవితాల్లో ఆచరించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కార్పొరేషన్ చైర్మన్లు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సరితా తిరుపతయ్య యాదవ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, చరణ్ కౌశిక్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, కార్పొరేటర్లు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

కరీంనగర్ బస్ స్టేషన్‌లో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి
కరీంనగర్ బస్ స్టేషన్‌లో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి