హైదరాబాద్(రైట్స్ మీడియా): భారత మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని రేపు(శనివారం) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో విప్రో సర్కిల్ వద్ద ఆవిష్కరించనున్న నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు పనులను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
హైదరాబాద్‌లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
⏩తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మన్మోహన్ సింగ్ పాత్ర చారిత్రాత్మకం.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక ప్రగతికి దిశానిర్దేశం చేసిన మహోన్నత ఆర్థికవేత్త: మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక ప్రగతికి దిశానిర్దేశం చేసిన మహోన్నత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి అని అన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఆర్థిక స్థిరత్వం కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ప్రజలకు హక్కులు, అవకాశాలను విస్తరించే దిశగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం వంటి కీలక చట్టాలు, కార్యక్రమాలు అమలులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. దేశ నిర్మాణంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
మన్మోహన్ సింగ్ మార్గదర్శకత్వంలో పనిచేసే అవకాశం నా అదృష్టం
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంట్ సభ్యుడిగా ఆయన మార్గదర్శకత్వంలో పనిచేసే అవకాశం తన ప్రజా జీవితంలో ఎంతో గర్వకారణమైన విషయమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆయన సహకారం, మార్గదర్శకత్వంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే అవకాశం తనకు లభించిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రాంతీయ అభివృద్ధికి కేంద్ర సహకారం అందించడంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ చూపిన సానుకూల దృక్పథాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర కీలకం
తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైనదని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2009లో ప్రక్రియ ప్రారంభించేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి, 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జరిగిన పరిణామాల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అప్పటి యూపీఏ ప్రభుత్వం, డాక్టర్ మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని అధికారికంగా పేర్కొంది.
హైదరాబాద్‌లో విగ్రహం ఏర్పాటు గర్వకారణం
హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన సేవలను స్మరించుకోవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలకు తగిన గౌరవం అందిస్తూ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.ఈ విగ్రహం కేవలం ఒక స్మారక చిహ్నం మాత్రమే కాదని, దేశ నిర్మాణంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అందించిన సేవలు, ఆయన ఆర్థిక దూరదృష్టి, ప్రజాసేవా విలువలు, నిరాడంబర నాయకత్వాన్ని భావితరాలకు గుర్తుచేసే చిరస్మరణీయ చిహ్నంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడిన గొప్ప ఆర్థికవేత్తగా, దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదులు వేసిన నాయకుడిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన చూపిన ఆర్థిక దూరదృష్టి, నిస్వార్థ ప్రజాసేవ, నిరాడంబర నాయకత్వం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రేపు(శనివారం) డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.