జయశంకర్ భూపాలపల్లి(రైట్స్ మీడియా): అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు, మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి మండలం, పెద్దాపూర్ రైతు వేదికలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 15 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. రేషన్ కార్డు కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు, ఆదాయ ధ్రువీకరణ తదితర అవసరాలకు కీలకమైన అధికారిక పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలకు గౌరవం, స్వేచ్ఛతో పాటు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను మహిళల పేరిటే మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయం
⏩రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క.
గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలి
అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, రానున్న 10 నుంచి 15 రోజుల్లో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు స్వయం ఉపాధి పొందేందుకు, వ్యాపారాలు ప్రారంభించేందుకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంఘాల ద్వారా రూ.లక్ష వరకు రుణం అందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విబిజి రాంజీ పథకం కింద గ్రామాల్లో సుమారు 370 రకాల పనులు చేపట్టేందుకు అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి సగటున రూ.50 లక్షల వరకు నిధులు వచ్చే అవకాశం ఉన్నందున మేకల షెడ్లు, కోళ్ల ఫారాలు, ఫామ్ పాండ్లు, డ్రైనేజీలు, కాలువలు తదితర పనులను చేపట్టి గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు వీవో భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో గుడిసెలు, తాత్కాలిక నివాసాల్లో ఉన్న పేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవాలనుకునే సొంత స్థలంలో నిలబడి ఫొటోలు ఇవ్వాలని సూచించారు. దీనివల్ల క్షేత్రస్థాయి పరిశీలన సులభతరం అవుతుందని పేర్కొన్నారు.
జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా, సురక్షితంగా నిత్యావసర సరుకులు అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆగస్టు 15 నుంచి జిల్లా వ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,39,530 స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా 3,95,962 మంది లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. భూపాలపల్లి మండల పరిధిలోని పెద్దాపూర్, బావుసింగ్‌పల్లి, మూలపల్లి, లంబాడితండ, సుబ్బక్కపల్లి గ్రామాల్లో మొత్తం 1,993 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నకిలీ, డూప్లికేట్ కార్డులకు తావులేకుండా హోలోగ్రామ్, ఇష్యూయింగ్ అథారిటీ ముద్ర, హిడెన్ ఇమేజ్ తదితర తొమ్మిది రకాల భద్రతా ఫీచర్లను ప్రభుత్వం కార్డుల్లో పొందుపరిచినట్లు కలెక్టర్ తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులను టి-రేషన్ మొబైల్ యాప్‌తో అనుసంధానం చేసినట్లు స్పష్టంచేశారు. దీని ద్వారా ప్రజలు తమ రేషన్ కార్డు వివరాలను డిజిటల్‌గా వినియోగించుకోవచ్చన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల విధానంతో రేషన్ పంపిణీలో లీకేజీలను అరికట్టి, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రావాల్సిన కోటా సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, తహసీల్దార్ లక్ష్మి రాజయ్య, ఎంపిడిఓ తరుణ్ ప్రసాద్, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.