Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

భూముల రీ సర్వే ను మరింత వేగవంతంగా పూర్తి చేయాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.

భూముల రీ సర్వే ను మరింత వేగవంతంగా పూర్తి చేయాలి
Share Short Clip Download PDF

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథినిలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

భూముల రీసర్వే పైన ఆనందం వ్యక్తం చేసిన రైతులు.

భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన భూముల రీ సర్వేను మరింత వేగవంతంగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సర్వేయర్లను ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పురోగతిని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామ పరిధిలో 3541 ఎకరాల భూమి ఉండగా ఇప్పటివరకు 2144 ఎకరాల భూమి రీసర్వే పూర్తి అయినట్లు సర్వేయర్లు కలెక్టర్ కు వివరించారు. పట్టాదారు పాస్ బుక్ లో నమోదైన భూమి విస్తీర్ణానికి క్షేత్రస్థాయిలో రైతు అనుభవిస్తున్న భూమి విస్తీర్ణానికి ఏమైనా తేడాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా గ్రామానికి చెందిన రైతులు రాజిరెడ్డి, రామరాజు, సంపత్ రెడ్డి, సునీల్ రెడ్డి, మాధవి, సరోజన, నిర్మల,తదితర రైతులు భూముల రీ సర్వే జరుగుతున్న పంట పొలాల వద్ద ఉండగా కలెక్టర్ వారితో మాట్లాడారు. రీ సర్వే జరుగుతున్న తీరును గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. భూముల రీ సర్వే చేస్తుండడం బాగుందని, రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని చేపట్టిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...

గ్రామంలో చేపట్టిన భూముల రీ సర్వే ను మరో 15 రోజుల్లో పూర్తిచేయాలని సర్వేయర్లను ఆదేశించారు. రైతుల భూములను రీ సర్వే చేసిన వివరాలను ల్యాండ్ పార్సల్ మ్యాప్( ఎల్పీఎం)లో నమోదు ప్రక్రియ కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. రీ సర్వే తో భూముల హద్దులు, విస్తీర్ణం, పట్టాదారు వివరాల్లో స్పష్టత రావడంతో భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూ రికార్డులు అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు. రోవర్లతో సర్వేయర్లు భూ రీసర్వే చేస్తుండగా కలెక్టర్
పరిశీలించి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే క్షేత్రస్థాయిలో పురోగతి బాగుండటంతో జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీరాం భూపాల్, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, జిల్లా భూములు కొలతలు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, తహసిల్దార్ విక్రమ్ కుమార్, సర్వేయర్ సూరజ్, తదితరులతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.