కర్నూలు/పత్తికొండ(రైట్స్ మీడియా): గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ దళిత యువకుడు చీకటి గోపి(30) లాకప్ డెత్ కు కారణమైన తాడికొండ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురుజుల పులికొండ డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మార్పీఎస్ నాయకులు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పత్తికొండ రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) ఓబులేసు కు వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొంగతనం నెపంతో పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతో చీకటి గోపి మరణించాడని, కానీ పోలీసులు సాధారణ మరణం క్రింద చిత్రీకరించడం అత్యంత కిరాతకమైన చర్యని అన్నారు. చీకటి గోపి మరణానికి కారకులైన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితుల మరణాలు ఇప్పటికీ 25 మంది హత్యకు గురైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. పోలీసు లాకప్ లో మృతి చెందిన చీకటి గోపి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చీకటి గోపి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా తో పాటు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి మంజూరు చేసి ఆదుకోవాలని పేర్కొన్నారు. దళితులపై ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా రాష్ట్ర హోం శాఖ అధికారులు పటిష్టమైన ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మహాదేవ్, జిల్లా కో కన్వీనర్లు నరసింహులు, ఈశ్వర్, ప్రసాద్ ఉచ్చురప్ప తిక్కయ్య, దేవనబండ లక్ష్మన్న, పత్తికొండ రాజు తదితరులు పాల్గొన్నారు.