హైదరాబాద్(రైట్స్ మీడియా): ఆర్భన్ రియాలిటీ గ్రూప్ కి చెందిన 35 ఏళ్ల వ్యాపారవేత్త సామ ప్రణీత్ రెడ్డి, రికార్డు స్థాయిలో రూ. 39,00,000/- (నలభై లక్షల రూపాయలు) వేలంలో వేసి పవిత్రమైన బాలాపూర్ గణేష్ లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన సామ ప్రణీత్ రెడ్డి, ఇటీవల అమెరికా (US) నుండి తిరిగి వచ్చి 'ఆర్భన్ గ్రూప్స్' పేరుతో తన వ్యాపారాన్ని ప్రారంభించారు.
శుక్రవారం ఉదయం బాలాపూర్ గణేష్ చివరి పూజా కార్యక్రమం అనంతరం క్రేన్ సహాయంతో బాలాపూర్ గణేషుడ్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించి… ఉదయం 7గంటలకు గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 9:00 గంటలకు ప్రదక్షిణ పూర్తి చేసుకుని.. బాలాపూర్ గ్రామ బొడ్రాయి దగ్గరకు గణేష్ విగ్రహాన్ని తీసుకువచ్చారు. . ఉదయం 9:30 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమయింది. లడ్డూ వేలం తర్వాత హుస్సేన్ సాగర్కు బాలాపూర్ గణేష్ ను తరలించారు. 18 కిలోమీటర్లపాటు బాలాపూర్ గణేష్ శోభాయత్ర కొనసాగింది. . ఖైరతాబాద్ గణేశుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టినీ ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట. ఇక్కడి లంబోదరుడి చేతిలో ఉండే లడ్డూ వేలం పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటోంది. లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే గణేశుడి లడ్డూ వేలం పాట కోసం సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గతంలో లడ్డూ దక్కించుకున్న 32 మందితో పాటు ఈసారి కొత్తగా 8 మంది భక్తులు వేలంలో పాల్గొన్నారు.