Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలి: మంత్రి ఎస్. సవిత

విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలి: మంత్రి ఎస్. సవిత
Share Short Clip Download PDF

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని, బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆదేశించారు.

తాడేపల్లి(రైట్స్ మీడియా):

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని, బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆదేశించారు.

వ్యాధులు ప్రబలకుండా హాస్టళ్లు, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు.

గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, విద్యార్థుల భద్రతపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు వేడిగా, తాజాగా తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే అందించాలని, బయటి ఆహారాన్ని హాస్టళ్లలోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగునీటిగా అందించాలని ఆదేశించారు.

హాస్టళ్లు, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, వ్యాధులు ప్రబలే ప్రమాదాన్ని నివారించేందుకు ముందస్తుగానే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు ఎవరైనా అస్వస్థతకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని ఆసుపత్రులకు తరలించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

అలాగే, పాత భవనాల్లో ఉంటున్న విద్యార్థులను గుర్తించి, వారిని తక్షణమే సురక్షితమైన భవనాల్లోకి తరలించాలని మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అధికారులు, హాస్టళ్లు, గురుకులాల సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉంటూ విద్యార్థుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు.