Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ఒప్పంద పార్ట్‌టైం, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్

-- కాకతీయ యూనివర్సిటీ వీసి ఆచార్యులు కే. ప్రతాప్ రెడ్డి.

ఒప్పంద పార్ట్‌టైం, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్
Share Short Clip Download PDF

కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒప్పంద, పార్ట్‌టైం, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం విశ్వవిద్యాలయ సెనెట్‌హాల్‌లో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ పి. కరుణాకర్ ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఒప్పంద అధ్యాపకులు డాక్టర్ ఒంటేరు రవీందర్ సంస్మరణ సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్‌ఛాన్సలర్ మాట్లాడుతూ..

రవీందర్ కుటుంబ సభ్యులకు విశ్వవిద్యాలయం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులు, ఇతర ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి విశ్వవిద్యాలయం తరఫున వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రవీందర్ కుటుంబానికి అందరూ కలిసి సహకరించాలని, ఆయన సతీమణి డాక్టర్ జ్యోత్స్న ధైర్యంగా ఉండాలని, పిల్లల భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన సూచించారు.

రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం మాట్లాడుతూ

డాక్టర్ రవీందర్ మంచి ప్రేరణాత్మక భావాలు, ఆత్మవిశ్వాసం, కృతజ్ఞతా భావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన మృతి అత్యంత విషాదకరమని, కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని అన్నారు. సభ ప్రారంభంలో డాక్టర్ ఒంటేరు రవీందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం ఒక నిమిషం మౌనం పాటించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ

డాక్టర్ రవీందర్ SC/ST విద్యార్థి సంఘం స్థాపనలో కీలక పాత్ర పోషించారని, సామాజిక మార్పు కోసం కృషి చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. మంచి ఉపాధ్యాయుడిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, కష్టపడి పనిచేసే పరిశోధకుడిగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. విశ్వవిద్యాలయం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబ సభ్యులకు తగిన సహాయం అందించాలని, అయన సతీమణి ని పార్ట్ టైం నుంచి ఒప్పంద అధ్యాపకురాలు గా పదోన్నతి చేయాలనీ, పెద్ద మొత్తం లో ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి అని కోరారు. అలాగే రవీందర్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అకుట్ (AKUT) ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు

కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్రా రాజు, ఆఫీసర్ on స్పెషల్ డ్యూటీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి, కాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి. మనోహర్, కామర్స్ విభాగ డీన్ ఆచార్య రాజేందర్ కట్ల, ప్రిచ్నిపాల్ ఆచార్య ఎస్. నరసింహ చారి, డాక్టర్ కనకయ్య, డాక్టర్ ఎస్. రాజేష్, డాక్టర్ ఫిరోజ్, డాక్టర్ సంకేనేని వెంకట్, డాక్టర్ బ్రహ్మం, డాక్టర్ లింగయ్య, డాక్టర్ స్వామి, డాక్టర్ శేషు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఉపేందర్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాకతీయ, ఉస్మానియా, జేఎన్‌టీయూ, శాతవాహన విశ్వవిద్యాలయాలకు చెందిన ఒప్పంద అధ్యాపకుల సహకారంతో డాక్టర్ రవీందర్ కుటుంబానికి రూ.2.40 లక్షల విలువైన చెక్కును అందజేశారు.