ఇంద్రకీలాద్రి లో దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తురాలు మృతి చెందింది. ఇంద్రకీలాద్రి మహా మండపం రెండో అంతస్తులో అస్వస్థతకు గురైయింది. భక్తురాలిని దేవస్థాన అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన కె. పద్మ(61). తన భర్త నాంచారయ్యతో కలిసి గురువారం అమ్మవారి దర్శనానికి వచ్చింది. అమ్మవారి దర్శనం అనంతరం అన్నప్రసాదం స్వీకరించేందుకు రెండో అంతస్తులో దింపాలని లిఫ్టు సిబ్బందిని భక్తురాలు కోరారు. రెండో ఫ్లోర్లో కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో దింపిన సిబ్బంది.. మెట్లపై రెండో అంతస్తుకు వెళ్లాలని ఆదేశించారు. మెట్లు ఎక్కే క్రమంలో భక్తురాలు పద్మ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వెంటనే పద్మను దేవస్థాన అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసారు. అయితే మార్గమధ్యలో పద్మ మృతి చెందింది. స్థానిక పోలీసులు ఈ ఘటన పై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.