Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులతో నిరుపేదలకు భరోసా

11 మంది లబ్ధిదారులకు రూ.6.50 లక్షల చెక్కులు పంపిణీ చేసిన వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులతో నిరుపేదలకు భరోసా
Share Short Clip Download PDF

అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) అండగా నిలుస్తోందని వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ కడియం కావ్య అన్నారు. వైద్య ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా చేయూత అందిస్తోందని తెలిపారు.

హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గురువారం వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6.50 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ..

పేద ప్రజలకు అత్యవసర సమయంలో వైద్య సహాయం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య గారికి కృతజ్ఞతలు తెలిపారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అందించిన ఈ సహాయం తమ కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చిందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.