ఖమ్మం జిల్లాలో గణేష్ ఉత్సవాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు అందిస్తున్న సహకారం అభినందనీయమని, గణేష్ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన అనుమతులు నిబంధనల మేరకు అందిస్తామని తెలిపారు.
ప్రతి గణేష్ మండపానికి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, మండపాలు ఏర్పాటు చేసే సమయంలో ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, పూర్తి రోడ్డు ఆక్రమించేలా మండపాలు ఏర్పాటు చేయరాదని సూచించారు.
వినాయక విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ షాక్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయరాదని అన్నారు. అనవసరంగా భారీ సౌండ్ బాక్సులు ఏర్పాటు చేయకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ కోరారు.
ప్రస్తుతం నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో గణేష్ నిమజ్జనానికి అవసరమైన నీటి సరఫరాపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అన్నారు. నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా నిల్వ చేయాలి అనే అంశాలపై ముందుగానే చర్యలు ప్రారంభించాలని, నీటి నిల్వ సాధ్యం కాని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
నిమజ్జనం పాయింట్ల వద్ద అవసరమైన బ్యారికేడ్లు, క్రేన్లు, త్రాగునీరు, లైటింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. నిమజ్జనం సందర్భంగా జిల్లాలో ఎక్కడా మద్యం విక్రయాలు జరగకుండా మద్యనిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
ప్రతి నిమజ్జన పాయింట్ వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, 108 వాహనం, పాము కాటు మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద మూడు షిఫ్టుల్లో పారిశుధ్య సిబ్బందిని నియమించి నిరంతరం పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.
నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లకు అదనపు డ్రైవర్లు, క్రేన్ మరమ్మతులు చేసే మెకానిక్‌లను అందుబాటులో ఉంచాలని అన్నారు. నిమజ్జనం రోజున ఉదయం 6 గంటలకే క్రేన్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. విగ్రహాల తరలింపుకు అడ్డుగా వచ్చే చెట్టు కొమ్మలను ముందుగానే తొలగించాలని అన్నారు.
నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన మేరకు గజ ఈతగాళ్లను షిఫ్టుల వారీగా నియమించాలని, స్విమ్మర్లతో ముందుగానే చర్చించి వారికి విధుల షిఫ్ట్ వివరాలను తెలియజేయాలని అన్నారు. ప్రతి వినాయక మండపం వద్ద పోలీస్, ఫైర్, విద్యుత్, వైద్య తదితర అత్యవసర సేవల సంప్రదింపు వివరాలతో కూడిన చిన్న పోస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన రూట్ మ్యాప్‌ను ముందుగానే సిద్ధం చేయాలని, నిమజ్జన రూట్లలో అవసరమైన రోడ్డు మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో ఎత్తైన విగ్రహాల తరలింపును ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు.
నిమజ్జన పాయింట్లకు అప్రోచ్ రోడ్లు సక్రమంగా ఉండేలా చూడాలని, ప్రతి వినాయక మండపాన్ని రిజిస్టర్ చేసి, అక్కడ చేపడుతున్న ఏర్పాట్ల వివరాలను ముందుగానే సేకరించాలని అన్నారు. విగ్రహాల తరలింపుకు అడ్డుగా ఉన్న ఇంటర్నెట్, టీవీ కేబుళ్లను సరిచేయాలని సూచించారు.
ప్రతి గణేష్ మండపానికి ప్రభుత్వం నిబంధనల మేరకు విద్యుత్ కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లైన్‌మ్యాన్ ద్వారా విద్యుత్ కనెక్షన్ అందించేలా చూడాలని, ప్రజలు స్వయంగా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని ప్రమాదాలకు గురికావద్దని కలెక్టర్ కోరారు.