రేగొండ (రైట్స్ మీడియా): గవర్నర్ కోటాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు, భూపాలపల్లి పద్మశాలి సంఘం నాయకుడు ఎంగల తిరుపతి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

శనివారం రేగొండ మండల కేంద్రములో ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని,ఎన్ఎస్యూఐ నుండి కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు.

రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ "పేదోళ్ల డాక్టర్" గా గుర్తింపు పొందారని, మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షులుగా, ఫిజియోథెరపిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షులుగా, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బహుజన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు.

పార్టీ కోసం అనేక రాష్ట్రాల ఎన్నికల్లో ఇన్‌చార్జ్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని, ఆయనకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, 60కి పైగా ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు.

పేద, బడుగు, బలహీన వర్గాల నాయకుడైన డాక్టర్ రామకృష్ణకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇచ్చి, శాసన మండలిలో బహుజనుల గొంతుకను వినిపించే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎంగల తిరుపతి కోరారు.