నేత్రదానం చేయడం ద్వారా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన నేత్రదాన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు డాక్టర్ పి. శ్రీజతో పాటు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేత్రదాన ప్రాధాన్యత, అర్హతలు, నేత్రదానం సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఖమ్మం నేత్రనిధి అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు.
నేత్రదానం చేయండి – మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపండి...
--అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ..
41వ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న నేత్రదాన అవగాహన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “నేత్రదానం చేయండి – మరోకరి జీవితంలో వెలుగులు నింపండి” అనే సందేశంతో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నేత్రదానం ఎవరైనా చేయవచ్చని తెలిపారు. కళ్లద్దాలు వాడేవారు, మధుమేహం, బీపీ, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడేవారు, కంటిశుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చని పేర్కొన్నారు. కామెర్లు, ఎయిడ్స్, బ్లడ్ క్యాన్సర్ కారణంగా మరణించిన వారు నేత్రదానానికి అనర్హులని, ఇతర కారణాలతో మరణించిన వారు ఏ వయస్సులోనైనా నేత్రదానం చేయవచ్చని తెలిపారు.
ఒకరి నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపు లభించే అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు. నేత్రదానం వల్ల మృతదేహం ముఖాకృతిలో ఎలాంటి మార్పు ఉండదని, కంటి పై పొర అయిన *కార్నియాను మాత్రమే* సేకరిస్తారని చెప్పారు. నేత్రదానం చేసిన వ్యక్తి మరణించిన అనంతరం కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, నేత్రదానం ఒక మహత్తర సేవగా గుర్తించాలని కోరారు. మరణించిన వ్యక్తి నుంచి 6 నుంచి 8 గంటల్లోపు నేత్రాలను సేకరించాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు. మరణించిన వెంటనే కళ్లను మూసి వాటిపై తడి గుడ్డ లేదా ఐస్ ముక్క ఉంచాలని, తల క్రింద రెండు దిండ్లు ఎత్తుగా ఉంచాలని, ఫ్యాన్‌ను ఆఫ్ చేయాలని సూచించారు. మరణం సంభవించిన వెంటనే ఖమ్మం నేత్రనిధికి సమాచారం అందించడం ద్వారా సకాలంలో నేత్రదానం చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
తమ చుట్టుపక్కల ఎవరైనా మరణించి నప్పుడు వారి కుటుంబ సభ్యులను నేత్రదానానికి ప్రోత్సహించి ఖమ్మం నేత్రనిధికి సమాచారం అందించాలని సూచించారు. “సర్వేంద్రియానాం నయనం ప్రధానం – నేత్రదానం శ్రేష్ఠదానం” అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. నేత్రదానం చేసిన వారి భౌతికకాయాన్ని ఖమ్మం పట్టణంలోని ఆసుపత్రుల నుంచి వారి స్వస్థలానికి తరలించేందుకు ఖమ్మం నేత్రనిధి ఆధ్వర్యంలో ఉచిత వ్యాన్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. అంతిమయాత్ర సమయంలో వైకుంఠధామం వరకు కూడా ఉచిత వాహన సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
నేత్రదానం చేయదలచిన వారు లేదా నేత్రదానానికి సంబంధించిన వివరాల కోసం ఖమ్మం ఐ బ్యాంక్ సెల్ నంబర్లు 9397191919, 9247571995 నందు సంప్రదించాలని అదనపు కలెక్టర్ సూచించారు. నేత్రదానంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేత్రదాన ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా. రామారావు, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, డిబిసిఎస్ డాక్టర్ బి. వెంకట నర్సయ్య, ఆప్తాలమిక్ సిబ్బంది ప్రవీణ్, నరేష్, కౌన్సిలర్ హరిప్రసాద్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.