Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

రీ-సర్వే డేటా ఎంట్రీలో ఏమాత్రం పొరపాట్లకు తావివ్వొద్దు

రీ-సర్వే డేటా ఎంట్రీపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.

రీ-సర్వే డేటా ఎంట్రీలో ఏమాత్రం పొరపాట్లకు తావివ్వొద్దు
Share Short Clip Download PDF

కూసుమంచి మండలం భగత్‌వీడు గ్రామంలో చేపడుతున్న రీ-సర్వేలో భాగంగా డేటా ఎంట్రీ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం భగత్‌వీడు గ్రామ రీ-సర్వేకు సంబంధించిన డేటా ఎంట్రీ విధానంపై సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గ్రామపంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, సంబంధిత సిబ్బందికి జిల్లా కలెక్టర్ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ

ఫీల్డ్‌ స్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా పక్కాగా డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. భగత్‌వీడు గ్రామంలోని మొత్తం భూమికి సంబంధించిన వివరాలను టీమ్‌ల వారీగా క్రమబద్ధంగా నమోదు చేయాలని తెలిపారు. ముందుగా ప్రీ-రీ-సర్వే డేటాను నమోదు చేసి, అనంతరం రీ-సర్వే డేటాను ఎంటర్‌ చేయాలని కలెక్టర్ సూచించారు. రెండు దశల డేటాను క్షుణ్ణంగా క్రాస్‌చెక్‌ చేసిన అనంతరం మ్యాపింగ్‌ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. డేటా ఎంట్రీ లాగిన్‌ను కేవలం డేటా నమోదు కోసం మాత్రమే వినియోగించాలని, ఫ్రీజింగ్‌, కన్ఫర్మేషన్‌ ఆప్షన్లు తహసీల్దార్‌ లాగిన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

రీ-సర్వేకు ముందుగానే గ్రామ సరిహద్దులు, గ్రామ విస్తీర్ణం, శాఖల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను పక్కాగా నిర్ధారించు కోవాలని కలెక్టర్ తెలిపారు. ఆర్‌ అండ్‌ బీ రోడ్లు, పీఆర్‌ రోడ్లు, అటవీ భూములు, వక్ఫ్‌, ఎండోమెంట్‌ భూములు, కోర్టు కేసులకు సంబంధించిన భూముల వివరాలను ముందుగానే నమోదుచేయాలని సూచించారు. ఈ వివరాలన్నీ రీ-సర్వే డేటా ఎంట్రీకి ముందే పక్కాగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

రీ-సర్వే అనంతరం లభించిన వివరాలను కూడా జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టాదారు పాస్‌బుక్‌ (PPB) ఉన్న ఆక్యుపెన్సీ, PPB లేని ఆక్యుపెన్సీ వివరాలను విడివిడిగా నమోదు చేయాలని తెలిపారు. రీ-సర్వే అనంతరం ఏదైనా ప్రభుత్వ భూమి విస్తీర్ణంలో మార్పు గుర్తించినట్లయితే, నిబంధనల ప్రకారం అవసరమైన సవరణలు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. డేటా ఎంట్రీలో అప్రమత్తంగా ఉండాలని, ఒక్క తప్పు నమోదైనా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉందని కలెక్టర్ హెచ్చరించారు.

ప్రతి వివరాన్ని కనీసం పలుమార్లు క్రాస్‌చెక్‌ చేసిన తర్వాతే కన్ఫర్మ్‌ చేయాలని సూచించారు. ఎకరాలు, గుంటల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, గుంటల కొలత 40 కు మించకుండా చూసుకోవాలని తెలిపారు. 40 గుంటలకు మించిన కొలతను తదుపరి ఎకరాగా పరిగణించే విధంగా వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు.

రీ-సర్వే ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా పూర్తికావడానికి డేటా ఎంట్రీ అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. చిన్నపాటి పొరపాటు లేదా నిర్లక్ష్యం కూడా భవిష్యత్తు లో తీవ్ర సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉన్నందున ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నమోదు చేయాలని సూచించారు. ఫీల్డ్‌లో గుర్తించిన సమస్యలు, వ్యత్యాసాలు, సందేహాలను తప్పనిసరిగా రికార్డు చేయాలని కలెక్టర్ తెలిపారు. సంబంధిత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించిన అనంతరం మాత్రమే డేటాను నిర్ధారించాలని సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో కూసుమంచి తహసీల్దారు సైదులు, డిప్యూటీ తహసీల్దారు ఖాజా మొహిద్దీన్‌, ప్రధాన సర్వేయర్ మురళి, మండల సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గ్రామపంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.