జీడబ్ల్యూఎంసీ(రైట్స్ మీడియా): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేసి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఉప కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు. కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.
సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో కమిషనర్ పలు సూచనలు చేశారు. రోజువారీ చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు, రోడ్లు, ప్రధాన నాలాలు, బహిరంగ ప్రదేశాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సిబ్బంది విధుల నిర్వహణను తనిఖీ చేస్తూ, ఎక్కడైనా లోపాలు లేదా నిర్లక్ష్యం కనిపిస్తే తక్షణమే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డ్రై రిసోర్స్ కలెక్షన్ కేంద్రాలు, వేస్ట్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. వ్యర్థాల వేర్పాటు, నిల్వ, రవాణా, రీసైక్లింగ్ ప్రక్రియలు నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని, వ్యర్థాలు పేరుకుపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
తనిఖీల్లో గుర్తించిన సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పదేపదే నిర్లక్ష్యం వహించే సిబ్బంది, అధికారుల వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. చేపట్టిన పారిశుద్ధ్య పనులు, గుర్తించిన లోపాలు, వాటి పరిష్కార చర్యలపై క్రమం తప్పకుండా నివేదికలు సమర్పించాలని సూచించారు.
సీఎంహెచ్ఓ, ఎంహెచ్ఓ, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉప కమిషనర్ల సమన్వయంతో పనిచేస్తూ నగర పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరచాలని కమిషనర్ పేర్కొన్నారు. నగర పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, తమ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు పూర్తి బాధ్యత వహించాలని ఉప కమిషనర్లను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ జోన్ జోన, ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.