ఢిల్లీ (రైట్స్ మీడియా): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, దేశ సమగ్రతను దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపి భవిష్యత్ కార్యక్రమాలపై మాట్లాడారు.
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు వేరు, శివుడు వేరు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడటం వారి దిగజారుడు రాజకీయాన్ని తెలియజేస్తోందని, తెలంగాణ సమాజం ఆయన వైఖరిని ఛీత్కరించుకుంటోందని అన్నారు. కాంగ్రెస్‌కు బ్రిటిష్ కాలం నాటి 'విభజించు-పాలించు' విధానం అలవాటుగా మారిందని, ఇప్పుడు దేవుళ్ల మధ్య కూడా విభేదాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సనాతన ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు.
తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్-గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీల మెప్పు పొందేందుకు రోజుకో నాటకానికి తెరతీస్తున్నారని ఆరోపించారు. కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టి, ఇతర మతాల అండతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధికోసం ప్రాణత్యాగం చేస్తానని చెప్పకుండా సోనియా కుటుంబం కోసం ప్రాణత్యాగం చేస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు.